29-06-2025 12:00:00 AM
అధిక రక్తపోటు గలవారు డిమెన్షియాతో పాటు విషయాన్ని త్వరగా గ్రహించలేరని పరిశోధనలు చెబుతున్నాయి. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అధిక రక్తపోటు గల వృద్ధులు శారీరకశ్రమ, వ్యాయామంతో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని అమెరికాలోని వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ అధ్యయనం సూచిస్తోంది.
వారానికి కనీసం ఒకసారైనా ఒంటికి చెమట పట్టించే.. గుండె, శ్వాస వేగం పెంచే వ్యాయామాలు చేసేవారికి విషయగ్రహణ లోపం, మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం చాలామంది వృద్ధులు వ్యాయామం చేస్తున్న నేపథ్యంలో ఇది మంచి కబురేనని చెప్పుకోవచ్చు.
వ్యాయామంతో ఇలాంటి ప్రయోజనాలు కనిపిస్తున్నట్లు తెలిస్తే కాస్త కఠినమైన వ్యాయామాలు చేయడానికి మరింత ఉత్సాహం చూపుతారనీ పరిశోధకులు భావిస్తున్నారు. అయితే 75 ఏళ్లు లోపువారిలోనే తీవ్రమైన వ్యాయామాలతో ఈ ప్రయోజనాలు కనిపిస్తుండటం గమనార్హం.