ఓయూ హాస్టళ్లు యథాతథంగా కొనసాగుతాయి
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రకటన
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఉస్మానియావర్సిటీ హాస్టళ్లు యథాతథంగా కొనసాగుతాయని, విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి వేసవిలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో గడపాలనే ఉద్దేశంతో సెలవులు ఇవ్వడం సాధారణమైన విషయమేనని చెప్పారు. తప్పనిసరిగా హాస్టళ్లను ఖాళీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు
ఓయూ హాస్టళ్లను యథావిధిగా కొనసాగించాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, సీఎం రేవంత్‌రెడ్డికి ఓయూ విద్యార్థు లు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహ మీడియాతో మాట్లాడుతూ.. ఓయూ వీసీ బీఆర్‌ఎస్ ఏజెంట్ అని, యూనివర్సిటీలో నీటికొరత, విద్యుత్తు సమస్య ఉందని కుట్రపూరితంగా వీసీ చెప్పించారని ఆరోపించారు. ఆరోపణలపై ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు వచ్చి చర్చ పెట్టే దమ్ముందా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశంలో ఓయూ విద్యార్థులు పార్థు, నందు, శివ, వీరేష్, మహేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.




