calender_icon.png 21 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమాలు లేని సమాజమే మన ధ్యేయం

21-08-2025 07:19:52 PM

న్యాయమూర్తి కాసమల సాయి కిరణ్..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): వృద్ధాశ్రమాలు లేని సమాజమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి, ఆచరించాలని న్యాయమూర్తి కాసమల సాయి కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో వ్యయప్రయాసలు పడి పిల్లలను పెంచి పెద్ద చేస్తే, నేడు సమాజంలో వృద్ధులను ఆశ్రమాలకు అంకితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల మీద ప్రేమతో తల్లిదండ్రులు ఆస్తులన్నీ రాసి ఇవ్వడం ఆ తర్వాత నెల వారి ఖర్చుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం సాధారణంగా మారిందన్నారు. పెద్ద మనుషులు పసి పిల్లలతో సమానమని వారికి చట్టం అనేక రకాల హక్కులను రాజ్యాంగంలో కల్పించిందని వివరించారు.

ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు రాసిచ్చేటప్పుడు కొన్ని షరతులు విధించాలని అప్పుడే గిఫ్ట్ డీడ్, సెల్ డీడ్ లాంటివి పెద్దలకు అనుకూలంగా ఉంటాయాన్నారు. జీవితకాలం పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాల్లో వదిలిపెట్టడం చాలా దారుణమైన విషయమన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బాధ్యతగా పెంచే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పలువురు న్యాయవాదులు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి రిటైర్ ఎంప్లాయిస్ కు వివరించారు. అనంతరం న్యాయమూర్తి సాయి కిరణ్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోమిరెడ్డి సత్తన్న లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అక్కల శ్రీధర్, గుండారపు పద్మ, కారుకూరి సురేందర్,ఏజీపీ వేల్పుల సత్యం, రెడ్దిమల్ల ప్రకాశం, సుమన్ చక్రవర్తి, రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ నేరెళ్ల రాజమల్లయ్యతో పాటు పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.