21-08-2025 10:02:34 PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్
బెజ్జూర్ (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం పాపన్నపేట్, తలాయి, తిక్కపల్లి, సోమిని ప్రాంతాలలో ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని మీకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vittal) అన్నారు. గురువారం మండలంలోని ప్రాణహిత బ్యాక్ వాటర్‌తో నీట మునిగిన పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతుకు ఎకరానికి రూ.10వేలు ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కష్ణారావు కూడా జిల్లా పర్యటనలో పరిహారం ఇవన్నట్లు తెలిపారన్నారు. అలాగే ప్రతి రైతు వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం వాటిల్లిన వివరాలు సేకరిస్తారని తెలిపారు.
అధికారులు, రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురికాకుండా నష్టం వాటిల్లిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మండల అధికారి రామకృష్ణను ఆదేశించారు. అలాగే నష్టపోయిన రైతులు ఎమ్మెల్సీతో మాట్లాడుతూ గతంలో నష్టం జరిగినప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పరిహారం వచ్చిందని, బెజ్జూర్ మండలం తప్పా అని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్సీ అధికారులు నిర్ణీతమైన సమయాల్లో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అన్నారు. పంట నష్టపోయిన రైతుకు పరిహారం రాకుండా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే యూరియా రైతులందరికీ అందుతుందని, కొంత సమయం పట్టినా సరిపడ యూరియా వచ్చేలా అధికారులతో మాట్లాడతానన్నారు. సమస్యలు ఉన్న రైతులు తహశీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ మండల అధికారి రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.