మన మాణిక్యాలు రాజకవి హాలుడు
‘మానవ జీవితాన్ని సాహిత్యంలో దర్శింప చేయడమే సాహిత్య ప్రయోజనం’ అన్న సత్యాన్ని సుమారు 2,000 సంవత్సరాలకు పూర్వమే స్థిరీకరించిన వాడు హాలుడు. ‘హాలుడు కవి వత్సలుడు’ అంటూ ఘనమైన ప్రశంసలు అందుకొన్నాడు. స్వయంగా కవి అయిన ఈ రాజు కవులందరినీ ఆదరించి వాళ్లతో కవితలు రాయించాడు. ఆ కవితలను భద్రపరిచి, వాటిని ‘గాథాసప్తశతి’గా సంకలన పరిచాడని చరిత్రకారుల అభిప్రాయం.
‘శాతవాహన రాజవంశంలో 17వ రాజు హాలుడు’ అని మత్స్యపురాణం చెబుతున్నది. క్రీ.శ.69 సం॥రాల మధ్యకాలంలో అశ్మక రాజ్యంలోని ప్రతిష్ఠానాన్ని ఏలిన రాజు హాలుడేనని చరిత్ర తెలుపుతున్నది. హాలుడు రాజకవి. తదనంతర కాలంలో మనకు సాహిత్య చరిత్రలో కనిపించే నన్నె చోడుడు, శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథ నాయకులకన్నా తొలినాళ్లలోనే రాజ్యపాలనతోపాటు సాహిత్య ప్రేమికునిగా, స్వయంగా కవిగా పేరెన్నిక గన్న చక్రవర్తి.
లీలావతితో వివాహం
శాతవాహన రాజుల కాలంలో ప్రాకృతం రాజభాష. ఈ భాషలోని మహాకావ్యం ‘లీలావతి’. దీని ఆధారంగానే ‘హాలుడు అశ్మక దేశంలోని ప్రతిష్ఠాన పుర పాలకుడు’ అని తెలుస్తున్నది. ఇంతేకాక, ఈ కావ్యం హాలుడు ‘కోటిలింగాల’ రాజధానిగా వున్నప్పటిదేనన్న విషయాన్ని ఇటీవలి చరిత్రకారుల పరిశోధనలతో వెల్లడైంది. సింహళదేశ రాజపుత్రియైన లీలావతితో హాలుని వివాహం జరిగిన ఇతివృత్తం ఇందులో పొందు పరిచి వుంది. వారి వివాహం సప్త గోదావరీ తీర్థస్థ భీమేశ్వరంలో జరిగినట్లు తెలుపుతున్నది.
ఈ భీమేశ్వరాలయం ఉన్న వేంపల్లి వెంకట్రావుపేట నేటి ధర్మపురికి ఎగువన 40 కి.మీ.దూరంలో ఉంది. క్రీ.శ. 78 తరువాతనే శాతవాహనులు ఆంధ్రదేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించినట్లు చరిత్రకారుల భావ న. హాలుడు సంకలన పరిచిన ‘గాథాసప్తశతి’లోని పలు గాథల్లోని వర్ణనలు ఇక్కడి ప్రాంతాల్లోని అరణ్యవర్ణనలవలె ఉండటం కూడా ఒక కారణం. లీలావతి, హాలుల కథా కావ్యమైన ఈ ప్రాకృత కావ్యం పేరు ‘లీలావఈ’. 1800 అనుష్టుంప శ్లోకాలతో దీనిని ‘కుతూహలుడ’నే కవి రచించాడు. ఆయన వేద వేదాంగ విదుడు హాలుని గురించి తెలుసుకొనే ఆధారాలలో ఇది ప్రధానమైందని గుర్తించవచ్చు.
ప్రాకృత భాషకు స్వర్ణయుగం
హాలుని కాలం ఒక విధంగా ప్రాకృత భాషకు స్వర్ణయుగం వంటిదని భావించవచ్చు. ఆయన పేరు విన గానే జ్ఞాపకం వచ్చే మహాగ్రంథం ‘గాథాసప్తశతి’. రెండువేల సంవత్సరాల నాటి ప్రాకృత భాషలో ‘గాథా’ ఛంద స్సులో వివిధ కవులతో విరచితమైన పద్యాలను ఒకచోట చేర్చి, ఒక మహాసంకలనంగా ఈ బృహత్‌గ్రంథం రూపొందింది. ఈ లెక్కన మన సాహిత్య చరిత్రలో ‘గాథాసప్తశతి’ని తొట్టతొలి సంకలన గ్రంథంగా పరిగణించవచ్చు. సంకలనకర్త హాలుడే కావడం విశేషం.
ఇందులో ఆయన కవితలు కూడా ఉన్నాయి. తాను స్వయంగా కవి అయినా కేవలం ఒక కావ్యాన్ని రచించాలన్న ఆలోచనకన్నా, తనకంటే పూర్వం, తన సమకాలం లోని ఎందరో కవులు రచించిన కవితలను సంకలనం చేస్తే అది పది కాలాలపాటు సమాజంలో నిలు స్తుందన్న గొప్ప భావన ఆయనది. అలా, నాటి మహారాష్ట్రీ ప్రాకృత భాషలోని 700 ‘గాథ’లను ఒకచోటికి తెచ్చాడాయన. అపురూపమైన ఈ ‘గాథాసప్తశతి’ని సిద్ధం చేసిన మహనీయుడుగా హాలుడు సాహిత్య చరిత్రలో నిలిచిపోయాడు.
గేయరూపానికి అనువైన గాథలు
‘గాహా సత్త సయీ’ అని ప్రాకృత భాషలో వ్యవహరిం చే ఈ ‘గాథాసప్తశతి’తో చాలా విశేషాలు ముడిపడి ఉన్నాయి. ముందుగా ఇందులోని కవితలకు సంబంధించిన ఛందస్సును గురించి చెప్పుకోవాలి. ఇది ప్రాకృత భాషా ఛందస్సులో ఉండే కవితలు రచించపబడిన ఒక పద్యం పేరు. సంస్కృత ఛందస్సులైన ఉత్పలమాల, చం పకమాల, మత్తేభం, శార్దూలం వంటి వాటివలె, తెలుగు ఛందస్సులోని సీసం, కందం మొదలైన వాటివలె ప్రాకృతంలోని ఈ పద్యాలకు ‘గాథ’లని పేరు. సంస్కృత ఛందస్సుల వలె ఇది గణబద్ధ ఛందస్సు కాదు. ‘గాథ’ మాత్రాబద్ధ ఛందస్సుకు సంబంధించింది. ఒక విధంగా గేయరూపానికి ఎంతో అనువైంది. ప్రాకృత భాషావేత్తలు గాథా ఛందస్సుల్లో ఏడు విధాలున్నాయని అంటారు. గాహు, గాహా, ఎగ్గాహా, ఉగ్గాహా, గాహిణీ, సింగిణీ, ఖండ అని వాటికి పేర్లు.
ప్రజల పక్షాన నిలిచిన రచన
ఈ ‘గాథాసప్తశతి’లోని గాథలు ముక్తకాలు. అంటే, ఏ పద్యానికి ఆ పద్యమే తప్ప ఒక దానికొకటి సంబంధించినవి కావు. ఒక విధంగా శతకం వంటి రచన, కాని మకుట నియమం వర్తించదు. పైగా ఒక్కో గాథ ఒక్కో రచయిత రచించింది. ప్రతి గాథా ప్రత్యేకమైందే. హాలుని సాహిత్య దర్శనం ఎంత విస్తృతమైందో, ఎందరి కవిత్వాలను ఆస్వాదించాడో ఈ సంకలనం చూస్తే తెలుస్తుంది. ఈ ‘గాథాసప్తశతి’ ఔన్నత్యం ఏమిటి? అని ప్రశ్నించుకున్నప్పుడు, ఇది ప్రజల పక్షంగా నిలిచే రచనగా సాహితీవేత్తలు ప్రశంసించారు.
కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవే ఈ రచనకు అబ్బురపడి తన ‘నూనూగు మీసాల నూత్న యౌవన’ దశలోనే దీన్ని అనువదించే ప్రయత్నం చేశాడు. దురదృష్టవశాత్తు అది నేడు అలభ్యం. ఆనాటి శ్రీనాథుని నుండి ఆధునిక కాలానికి చెందిన ప్రముఖ పండితులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఘట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, డా॥ కోడూరి ప్రభాకరరెడ్డి, బొల్లోజు బాబా, నరాల రామారెడ్డి వంటి మహనీయులు అనువదించే ప్రయత్నం చేశారు. సుప్రసిద్ధ సాహితీవేత్త తిరుమల రామచంద్ర ‘గాథాసప్తశతి’కి సంబంధించిన అనేకానేక వ్యాసాలను వివిధ పత్రికల ద్వారా అం దించడమే కాకుండా కొన్ని కొత్త గాథలను అనువదించి, తమ వ్యాసాల్లో సందర్భోచితంగా పేర్కొనడం విశేషం.
మొత్తం 37 మంది కవులు
సీహుడు, ఉల్లోలుడు, హాలుడు, మాణుడు, మాధవు డు, ణీలుడు మొదలైన 37 మంది కవుల రచనల్లోని 700 పద్యాలతో ‘గాథాసప్తశతి’ సంకలనాన్ని హాలుడు రూపొందించాడు. దీని ద్వారా కవిత్వ పరిచయం, కవిత్వాభిమానం వంటి విషయాలు అవగతమవుతాయి. అందుకే, తిరుమ ల రామచంద్రనాటి ‘భారతి’ వంటి పత్రికల్లో దీనికి సంబం ధించిన విపుల విశేషాలతో వ్యాసాలు రాసి తెలుగు వారికి అందించారు. హాలుని పేరు స్ఫురించడంతోపాటు ఒక మహాగ్రంథం కూడా జ్ఞప్తిలోకి రావడమనేది కవిత్వ ప్రాశ స్త్యం సార్వకాలికమైందన్న సత్యం అవగతమవుతుంది.
వ్యాసకర్త సెల్: 99490 13448
తెలుగువారి జీవన విలువలు
తెలుగు కుటుంబాలకు చెందిన జీవన సరళులు, ఇక్కడి వారి దైనందిన జీవిత విశేషాలు, నాటి సామాన్యుల సుఖదుఃఖాలు, వారి కష్టసుఖాలు, ప్రేమలు గొప్పగా చూపిన గ్రంథం ‘గాథా సప్తశతి’. అప్పటి వారి వినోద విహారాలు, పల్లెల్లోని సంతోషాలు, పెళ్లిళ్ల సంబరాలు వంటి ఎన్నెన్నో నాటి ప్రజా జీవితంలోని అనుభవాలను, అనుభూతులను అక్షరబద్ధం చేసి అన్ని కాలాల్లో నిలిచే గ్రంథంగా, అన్ని కాలాల్లోని కవులు ఇష్టపడే రచనగా ఇది ప్రకాశించింది. ఇందులోని అనేక కవితలను ధ్వనికారుడైన ఆనంద వర్ధనుడు, కావ్య ప్రకాశకారుడైన మమ్మటుడు వంటి ఎందరో లక్షణ శాస్త్రవేత్తలు తమ గ్రంథాలలో ప్రత్యేకంగా ఉదహరించడం దీని ప్రామాణికతకు నిదర్శనం.
శాస్త్రకారుల మన్ననలను కూడా పొందిన రచనగా దీని స్థాయి ఎంతటిదో మనం గ్రహించవచ్చు. శాతవాహనులు తెలుగు రాజులు. వీరి రాజ్యంలోని ప్రజ లు తెలుగు వారు. అందుకే, వారి జీవన విశేషాలతోబాటు అనేక కవితల్లో ఇక్కడ వ్యవహారంలో వినిపించే అత్త, అవ్వ, కరణి, అద్దం, పొట్ట, పిల్ల వంటి ఎన్నో తెలుగు పదాలు కొంచెం ఉచ్చారణ తేడాలతో చోటు చేసుకున్నాయని సాహితీ విమర్శకులు, చరిత్రకారులు అభిప్రా యపడ్డారు.






