మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
- 30న సీఎంతో కలిసి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం
- చింతకాని సభను చారిత్రాత్మకం చేయాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 30న రెండు లక్షల మందితో చింతకానిలో సీఎం భారీ బహిరంగ సభ
- మధిర నియోజకవర్గ చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా విజయవంతం చేయాలి
- ఏర్పాట్లపై మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో సన్నాహక సమావేశం
ఖమ్మం, జూన్ 22(విజయక్రాంతి): మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు అభివృద్ధి కోసం అనేక అద్భుతమైన స్కీంలను ప్రవేశపెట్టాము. ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం. అందుకు మధిర నియోజవర్గంలోని చింతకాని వేదిక కానుంది.
రెండు లక్షల మందితో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను మధిర శాసనసభ నియోజకవర్గ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా చారిత్రాత్మక విజయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సోమవారం చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్ రోడ్స్ వద్ద మధిర నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించి, సభ ఏర్పాట్లు మరియు జన సమీకరణపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదేనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన మన ప్రాంతం నుంచే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఇళ్లలోకి ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు.
ఈ చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులందరూ తరలివస్తున్నట్లు వెల్లడించారు. మన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే ఇలాంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలన్నదే మన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంగ్రెస్ శ్రేణులు పక్కాగా ’మైక్రో ప్లానింగ్’ చేసుకోవాలని సూచించారు.
ప్రతి బూత్లో వంద మంది జనాభాకు ఒకరిని ఇన్ఛార్జ్గా నియమించి, ఎంతమంది వస్తున్నారనే ఖచ్చితమైన జాబితాను పేరు, ఫోన్ నెంబర్తో సహా సిద్ధం చేయాలన్నారు. సభను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆరు ప్రత్యేక కమిటీలను (మండల ఆర్గనైజింగ్, వాహనాల పర్యవేక్షణ, ప్రచార, మీడియా, మంచినీటి సదుపాయాలు, వాలంటీర్ల కమిటీలు) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, డీసీసీ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ నాయకులతో కూడిన ’మండల ఆర్గనైజింగ్ కమిటీలను’ తక్షణమే ఏర్పాటు చేసుకొని, ప్రచార సామగ్రిని, వాహనాలను సమన్వయం చేసుకోవాలన్నారు. పోలీస్ వ్యవస్థపైనే పూర్తిగా భారం వేయకుండా, మన ముఖ్య నాయకులను గుర్తించి గౌరవంగా వేదికపైకి సాగనంపేందుకు కాంగ్రెస్ వాలంటీర్లే గేట్ల వద్ద బాధ్యత తీసుకోవాలని సూచించారు.
రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెప్పాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువ్వాళ దుర్గాప్రసాద్, నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, ఏరియా బూత్ ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బహిరంగ సభ స్థలాలను పరిశీలించిన భట్టి..
ఈనెల 30 న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నిమిత్తం నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం చింతకాని మండలంలో అనువైన ప్రాంతాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి పరిశీలించిన ప్రదేశాల్లో బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించారు.
ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెలికాప్టర్ లో మధిర నియోజకవర్గం చేరుకోగా ఎమ్మెల్యే రాందాసు నాయక్, చైర్మన్ రాయల నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.






