11-10-2025 12:57:42 AM
అధికార, విపక్షనేతల మధ్య మాటల తూటాలు
ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు
సోషల్ మీడియాలోనూ విమర్శల దాడి
ఎల్బీనగర్ లో సీఎం దిష్టిబొమ్మ దహనం
ప్రభుత్వం నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి
రంగారెడ్డి, అక్టోబర్ 10( విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై స్టే, స్థానిక ఎన్నికల రద్దుపై పలువురి నుంచి ఆగ్రహ జ్వాల రగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆయా రాజకీయ పార్టీల మధ్య సోషల్ వార్ మొదలైంది. గత కొన్నిరోజులుగా ఎన్నికల ఫక్రియపై ప్రభు త్వం స్పీడ్ పెంచడంతో ఆ దిశగానే ఆయా పార్టీల నేతలు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ పోటీకి సిద్ధపడ్డారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు ఒకపక్క ఆర్థిక వనరులను సమకూ ర్చుకోవడం తోపాటు తమ మద్దతుదారులను కూడగట్టుకొని ప్రచారంలోకి సైతం దిగారు.
కుల సంఘాలు, యువజన సంఘా లు, మహిళా సంఘాల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తనకు మద్దతు పలికితే మీకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానంటూ వారు అందించిన కోరిక చుట్టాలకు జీహూజూరంటూ హామీలు సైతం ఇచ్చారు. మరి కొందరు ఆశావహులు దసరా పండగకు బోనంజాలు ప్రకటించి మందు విందులకు భారీగా ఖర్చుచేశారు.
వీళ్లంతా ఎన్నికల షెడ్యూలు ప్రకారం ప్రకటించిన నామినేషన్ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో వెళ్లి తమ నామినేషన్ల సెట్ల ను సైతం రిటర్నింగ్ అధికారులకు దాఖలు చేశారు. తీరా గురువారం సాయంత్రం హైకోర్టు ఎన్నికలపై స్టే విధించడంతో అభ్యర్థులంతా ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం కోర్టు తీర్పు పై అవక్కయి... విస్మయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు
స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడం తో ప్రభుత్వం సైతం కొంత అయోమయంలో పడింది. తక్షణ కింకర్తవ్యం పై సం బంధిత మంత్రులు, అధికారులతో చర్చలు సైతం ప్రారంభించింది. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థల బీసీలకు 42శాతం ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు పోతామంటూ ప్రకటనలు సైతం జారీ చేస్తుంది. దీంతో ప్రభుత్వం పాత రిజర్వేషన్లపై పోతుందా? హైకోర్టు నిర్ణయం పై సుప్రీంకోర్టుకు వెళ్తుందా?...
అసలు ప్రభుత్వ మదిలో ఏముంది? ఇలా రకరకాల చర్చలు సైతం మొదలయ్యాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయి...
పంచాయతీలు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు నిధులు లేక పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి లేక కునారిల్లుతున్నాయి. కనీసం సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధపడింది.
సీఎం చిత్రపటం దహనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్ కూడలిలో ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు. పోలీసులు ఇది గమనించి ఆందోళకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దీంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య కొంత తోపులాట జరిగింది. షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడలో బీసీసేన ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా జరిగేవని... బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఓట్ల రాజకీయాల కోసమే ఈ డ్రామాలాడారని ఆయా పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుత వాతావరణం లోనే తమ హక్కులను సాధించుకుంటామని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో కోర్టు నిర్ణయం పైనే ఏడతెగని చర్చలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవో నెంబర్ 9పై సంబంధిత విధివిధానాలను నాలుగు వారాల లోగా ప్రభుత్వం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలపై ఎలా ముందుకు పోతుందోనని... అసలు ఎన్నికలను ప్రభు త్వం నిర్వహిస్తుందా? లేదా? అని అందరి మదిలో తెలుస్తున్న ప్రశ్న.