calender_icon.png 11 October, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి

11-10-2025 12:55:29 AM

  1. అంతర్రాష్ర్ట డ్రగ్స్ ముఠా అరెస్ట్

కోటి రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

ఎల్బీనగర్, అక్టోబర్ 10 : డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు నల్లమందు తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్తాన్ రాష్ర్టం నుంచి నల్ల మందు(ఓపియం), గసగసాల గడ్డి(పెప్పీస్ట్రా) పౌడర్ ను తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న అంతర్రాష్ర్ట మాదకద్రవ్యాల ముఠాలో ఒక సభ్యుడిని మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి, శుక్రవారం ముఠా గుట్టురట్టు చేశారు.

ఈ సందర్భంగా ఒకరిని అరెస్టు చేసి, అతడి నుంచి కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల నల్లమందు, రెండు కిలోల గసగసాల గడ్డి పౌడర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎల్బీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

రాజస్థాన్ రాష్ర్టం చిత్తోర్ ఘాట్ కు చెందిన లోకేష్ భరత్ ( 26) పదో తరగతి వరకు చదివి వివిధ పనులు చేసి మూడు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జగదీష్ గుజ్జర్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాదకద్రవ్యాల రవాణాకు సిద్ధపడ్డారు.

ఈ క్రమంలో హైదరాబాద్, చెన్ను తోపాటు ఇతర నగరాలకు నల్లమందు విక్రయించి, డబ్బు సంపాదించడానికి ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు నెలలో హైదరాబాద్ కు వచ్చిన జగదీష్ గుజ్జర్ ఆదేశాల మేరకు కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక గుర్తు తెలియని వ్యక్తికి లోకేష్ భరత్ రెండు కిలోల ఓపియం విక్రయించాడు.

అదేవిధంగా లోకేష్ ఈ నెల 8న రాజస్తాన్ నుంచి 7 కిలోల నల్లమందు, రెండు కిలోల గసగసాల గడ్డి పౌడర్(పెప్పీస్ట్రా) తో రైలులో ప్రయాణిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాదు కు చేరుకున్నాడు. పక్క సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, కీసర పోలీసులు చర్లపల్లి వద్ద భరత్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.1 కోటి విలువైన నల్లమందు, గసగసాల గడ్డి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మత్తుకుకు దూరంగా ఉండాలి

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.  మాధక ద్రవ్యాల ముప్పును అరికట్టడంలో పోలీసులతో పాలుపంచుకోవాలని సూచించారు. నిషేధిత మాదకద్రవ్యాలను సేకరించడం, అమ్మడం, రవాణా చేయడం, వినియోగిస్తే సెక్షన్ 31ఏ ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష మరణ శిక్ష విధిస్తారని హెచ్చరించారు.

కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, మల్కాజిగిరి ఎస్వోటీ డీసీపీ రమణ, భోగిర్, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ ఎన్.నర్సింహారెడ్డి, ఏసీపీ అంజయ్య, ఇన్ స్పెక్టర్ జానయ్య ఎం.సాయికుమార్, కీసర సీఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.