24-10-2025 11:24:12 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించుకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్న అధికారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో నకిరేకల్ నియోజకవర్గంలో అనేక ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయ్యింది. తేమ శాతం వచ్చిందనుకున్న పరిస్థితులలో మళ్లీ వర్షం కురిసిరైతులనుఇబ్బందుల్లోకి నెట్టేసింది. రైతులు రోధిస్తూ తడిసిన తమ ధాన్యాన్ని ఆరబెడు కుంటున్నారు.
శాలిగౌరారం 93.3 , కేతేపల్లి 45.3 కట్టంగూరు 37.3 నార్కట్ పల్లి 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం మండలాలలో నమోదయింది. నకిరేకల్ మండలంలో మొత్తం 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎసిఎస్, ఎన్డీసీఎం ఎస్ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నోముల, వల్లభాపురం, ఒగోడు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. ఈ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.
15 రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడికాపులు కాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులను తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. శుక్రవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు లేక చిరిగిన పట్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కుప్పల వెంట నిలిచిన నీటిని రైతులు వర్షంలోనే పారలతో తొలగించారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: రైతులు
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని రైతులు మర్రి వెంకటయ్య, బచ్చుపల్లి లక్ష్మణరావు, అంతటి వెంకటయ్య, మర్రి బక్కయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మంగళపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నారని విమర్శించారు రైతులకు పట్టాలు అందించకపోవడం వల్ల ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. అవసరమైన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.