calender_icon.png 6 September, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధనుష్‌కు జోడీగా..

06-09-2025 12:25:31 AM

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తన సత్తా చాటుతూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ 1న విడుదల కానుంది. ధనుష్ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ రాజ్ దర్శకత్వంలో తన 24వ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ జూలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మరోవైపు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్న ‘డీ56’ (వర్కింగ్ టైటిల్) చిత్రం కూడా ధనుష్ చేతిలో ఉంది. ఈ రెండింటి మధ్య ‘డీ55’ని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి తెరకెక్కించనున్నారు. తాజాగా ‘అమరన్’తో హిట్ అందుకున్న రాజ్‌కుమార్ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ సినిమా గురించి ఓ సమాచారం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా ధనుష్ సరసన నటించనుందనేది ఆ వార్తా సారాంశం. ఈ ఏడాది ఆరంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వెంకటేశ్ లవర్‌గా సందడి చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ అందాల తార కోలీవుడ్ స్టార్‌తో జత కడుతుందనే ముచ్చట సినీప్రియుల్లో జోష్ నింపుతోంది. అయితే, గోపురం ఫిల్మ్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.