06-09-2025 12:23:21 AM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ విధానం సినీప్రియులకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు కేవలం 5 శాతం, 18 శాతంతో రెండు శ్లాబుల విధానం ప్రకారం సినీ పరిశ్రమలో సినిమా టికెట్లకు కూడా జీఎస్టీ రేట్లు తగ్గాయి. గతంలో రూ.100, అంతకంటే తక్కువ రేటు ఉన్న టికెట్లకు 12 శాతం జీఎస్టీ ఉండేది. రూ.100కు పైగా ఉండే టికెట్ రేట్లకు 18 శాతం ఉండేది. అంటే మల్టిప్లెక్స్‌లలో 18 శాతం జీఎస్టీ ఉండగా, సింగిల్ స్క్రీన్లలో 12 శాతం ఉండేది.
ఇప్పుడు కొత్త జీఎస్టీ విధానం ప్రకారం 12 శాతం శ్లాబ్‌ను 5 శాతానికి తగ్గించారు. అంటే రూ.100 లోపు ఉన్న టికెట్లకు జీఎస్టీ భారం ౭ శాతం తగ్గనుంది. కానీ, రూ.100 పైన.. మల్టిప్లెక్స్‌లలో మాత్రం అదే 18 శాతం కొనసాగుతోంది. అయితే థియేటర్స్ వ్యవస్థ ఈ జీఎస్టీని తమ రేట్లకు అనుగుణంగా రౌండ్ ఫిగర్ చేసి రూ.150, రూ.200, రూ.300, రూ.400లకు టికెట్లు అమ్ముతున్నారు.
ఇప్పుడు జీఎస్టీ తగ్గింది కాబట్టి సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లు తగ్గిస్తారా? లేకపోతే ఎలాంటి మార్పులూ లేకుండా టికెట్ ధర పెంచి రౌండ్ ఫిగర్ చేసి మళ్లీ పాత ధరలకే అమ్ముతారా? అనేది చూడాలి. అయితే, కొత్త జీఎస్టీ శ్లాబ్ సింగిల్ స్క్రీన్లకు ఓ వరం. థియేటర్ల నిర్వాహకులు పక్కాగా అమలు చేస్తే ప్రేక్షకులకు కూడా కొంత మేర టికెట్ ధరల భారం తగ్గినట్టవుతుంది.