6 April, 2026 | 6:24 PM

పోలింగ్‌కు కదిలిన ‘పాలమూరు’

14-05-2024 02:17 AM

పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతం

68.60శాతం పోలింగ్ నమోదు

మహబూబ్‌నగర్, మే 13 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో 17 సార్లు ఎన్నికలు జరుగగా, ఈసారి 18వ ఎన్నిక జరిగింది. సోమవారం ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. సాయంత్రం 5 గంటల నాటికి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 68.60 పోలింగ్‌శాతం నమోదైంది. మహబూబ్‌నగర్ కలెక్టర్ జి.రవినాయక్ జిల్లాకేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలో పలు కేంద్రాలను పరిశీలించారు.

అంచనాల్లో రాజకీయ పార్టీలు..

అభ్యర్థులు ఎవరికి వారు ‘మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏకంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. బీజేపీ నేతలు కూడా హిందూత్వవాదాన్ని ప్రజల్లో బలంగా వినిపించారు. బీజేపీ ప్రభావం కూడా ఓటర్లపై కొంత ఉంటుందంటున్నారు. మొదటి రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఉంటాయనేది పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

కొడంగల్‌కు సీఎం..

కోడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్‌రెడ్డి  కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ సరళిని పరిశీలించారు.

పోలింగ్ జరిగింది ఇలా...

పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మఖ్తల్, నారాయణపేట, కోడంగల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.33 శాతం నమోదైన పోలింగ్‌శాతం 5 గంటలకు 68.40శాతం నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో పోలింగ్ శాతం77.72గా నమోదైంది. దీంతో పొల్చుకుంటే లోక్‌సభ ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గింది. 

ఎదిర ఓటర్లు పోలింగ్‌కు దూరం...

జిల్లా కేంద్రంలోని నాలుగువార్డులోని ఎదిర ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. నాలుగోవార్డు పరిధిలో మూడు బూత్‌లు ఉండగా, మొత్తం 3,229 మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉన్నది. ఆ ప్రాంతంలో అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీ తీసేస్తేనే ఓటు వేస్తామని భీష్మించుకు కూర్చున్నారు. కలెక్టర్ జి.రవినాయక్ ఆ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఓటర్లు తలొగ్గలేదు. ఎవరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. ఓటు వేయలేదు.