26-11-2025 10:53:52 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న సూర్యాపేట డివిజన్‌కు చెందిన ఆర్వోలు, స్టేజ్-వన్ ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో జిల్లాలోని 8 మండలాల్లోనీ 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డులకు సంబంధించి 44 నామినేషన్ కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతను అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకొని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
దీనిలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ సమయంలో పాటించాల్సిన అన్ని నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. సమయపాలన పాటించడంతో పాటు, నామినేషన్ కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే నామినేషన్ కేంద్రాల్లో అవసరమైనన్ని ఫారాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, నామినేషన్ ప్రక్రియలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామ రావు, డీపీఓ యాదగిరి, డీఆర్‌డీఏ పీడీ వి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.