calender_icon.png 26 November, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

26-11-2025 10:24:40 PM

ఎస్పీ

తాండూరు (విజయక్రాంతి): జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, సహజ వనరులు అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్నేహ మెహరా హెచ్చరించారు. ఇసుక, ఎర్రమట్టి, ఎర్ర రాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా కఠిన చర్యలకు ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు జిల్లావ్యాప్తంగా అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా సహజ వనరులను తరలిస్తున్న వారిపై నిఘా పెంచి, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.

గత నాలుగు రోజులలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు 6 ఇసుక ట్రాక్టర్లను, 3 ఎర్రమట్టి టిప్పర్ లను, ఒకటి ఎర్రరాయి లారీని, ఒక జే‌సి‌బితో కలిపి మొత్తం 10 వాహనాలను సీజ్ చేసి నిందితులపైన కేసులు నమోదు చేశారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామంలో అనుమతి లేకుండా ఎర్రమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను, ఒక జేసీబీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇసుక ట్రాక్టర్‌ను, యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రరాయిని తరలిస్తున్న లారీని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకొని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో బాధ్యులైన డ్రైవరుల, యజమానులపైనా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎస్పీ స్నేహా మెహ్ర మాట్లాడుతూ, ఈ అక్రమ రవాణా వలన ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరైనా ఎక్కడైనా అక్రమ తరలింపులు జరిగినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.