13-10-2025 10:31:50 PM
ఈ కేవైసీ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో సరోజ..
గరిడేపల్లి (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరూ కచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని గరిడేపల్లి ఎంపీడీవో సరోజ కోరారు. సోమవారం మండల పరిధిలోని కితవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీల ఈ కేవైసీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల బోగస్ హాజరుకు, ఒకరి బదులు ఒకరు పనికి రావడం లాంటి వాటికి చెక్ పెట్టేందుకు జాతీయ మస్టర్ పర్యవేక్షణ సంస్థ యాప్ లో కూలీల వివరాలు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేసిందని, ఈ విధానంలో కూలీల జాబ్ కార్డులకు ఆధార్ ని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
దీని ద్వారా ఒకరికి బదులు మరొకరు పనికి వచ్చే అవకాశం ఉండదని, మృతుల పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదని ఆమె తెలిపారు. గరిడేపల్లి మండలంలోని 32 గ్రామపంచాయతీలో 39,451 మంది వర్కర్లు ఉండగా అందులో 25,266 మంది యాక్టివ్ వర్కర్లు ఉన్నారని, అందులో ఇప్పటికే 60 శాతం వరకు ఈ కేవైసీ పూర్తి చేశామని మిగతా పదివేల మందికి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.