22 April, 2026 | 6:06 PM

అరకొరగానే ఓటర్ స్లిప్‌ల పంపిణీ

10-05-2024 12:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటర్ల అందరికీ అందజేయాల్సిన ఓటరు స్లిప్‌లు అరకొరగానే పంపిణీ జరిగినట్టు పోలింగ్ అధికారులు, సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్  అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 45.91లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ నగర ప్రజల ఓటింగ్ శాతం క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాకున్నా 95శాతం అయినా ఓటర్లకు స్లిప్‌లను అందజేయాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం భావించింది. 

ప్రస్తుతం జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఈ నెల 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 3వ తేదీన ఓటరు స్లిప్ప్‌ల పంపిణీ ప్రారంభించగా, మొదటి రోజు పంపిణీలోనే చాలా మంది పోలింగ్ సిబ్బందికి ఓటరు స్లిప్‌లు అందలేదు. కొంతమందికి అందినా కూడా ఆ స్లిప్‌లపై ఎన్నికల కమిషన్ స్టాంపు (ముద్ర) వేసి ఉండకపోవడంతో స్లిప్‌లను పంపిణీ చేసే బూత్ లెవల్ అధికారులే ముద్రలు వేసుకుని పంపిణీకి సిద్ధం చేసుకోవడానికి మరో రోజు సమయం పట్టింది. అయితే, ఓటరు స్లిప్‌ల పంపిణీ ఇప్పటికే 85 శాతానికి పైగా పూర్తయినట్టుగా అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం విశేషం. జిల్లాలోని ముషీరాబాద్, అంబర్‌పేట, నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ చాంద్రాయణగుట్ట, కార్వాన్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఓటరు స్లిప్‌లు అందని వారు అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్నందున ఇప్పటికైనా అధికారులు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేయాలని ఓటర్లు కోరుతున్నారు.