07-10-2025 12:00:00 AM
రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు
మహబూబాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో పట్టు సాధిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుందనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు స్థానిక ఎన్నికల సమరానికి సమర శంఖం పూరించారు. మహబూబాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేపట్టారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం 4 సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పార్టీ క్యాడర్ తో సమీక్షలు నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గార్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అలాగే మరిపెడలో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే పెద్ద వంగర మండలంలోని వివిధ గ్రామాలకు ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి స్వాగతించారు. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, ఇప్పుడు జరిగే ప్రాదేశిక, సర్పంచ్ ఎన్నికలు వారికి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో పట్టు కొనసాగించేందుకు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపు సునాయాసం చేసుకోవడానికి ఇప్పటినుండే స్థానిక క్యాడర్ను పటిష్టపరిచి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను నిర్వహించేందుకు కూడా స్థానికంగా తమ క్యాడర్ పదవుల్లో ఉండాల్సిన పరిస్థితి కోసం పరితపిస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా..
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు చురుకుగా పావులు కదులుతున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ గ్రామస్థాయిలో వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ల ఎంపికకు అభ్యర్థుల ఖరారు కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఔత్సాహిక అభ్యర్థుల నుంచి రిజర్వేషన్ల ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా సాగుతోంది. ఆ మేరకు మండల స్థాయిలో ఎమ్మెల్యేలు సన్నాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో అభిప్రాయ సేకరణ చేస్తూ, ఎవరు పోటీలో నిలిస్తే గెలుస్తారనే విషయంపై స్పష్టత కోసం సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు, గెలుపు అంచనాలపై ముమ్మరంగా కార్యచరణ చేపట్టారు.