calender_icon.png 21 May, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగస్వామ్యం పరస్పర విజయానికి నాంది

21-05-2025 01:00:51 AM

ఒకరికొకరు సహకరించుకునే సంస్కృతి ఉండాలి. ముఖ్యంగా వ్యాపారంలో ఎప్పుడూ లాభాలు మాత్రమే రావు.. అప్పుడప్పుడు నష్టాలు చవిచూడాల్సి రావొచ్చు.. 

సంధాన కామయోరరి 

విజిగీష్వోః ఉపహన్తుమ

శక్తయోః విగృహ్యాసనం సంథాయవా!

(కౌటిలీయం - 7-4)

విజిగీషువు (గెలవాలని భావించేవాడు), శత్రువు (పోటీదారు) ఒకరినొకరు ఏమీ చేయలేని సమయంలో సంధి చేసుకోవాలని.. కోరిక ఉన్నవారయితే, వాళ్లు విగ్రహం చేస్తూ కాని, సంధి చేసుకొని గాని “ఆసనం” (తనకు అభివృద్ధి కలగడంకోసం శాంతంగా ఉండిపోవడం) చేయా లి. పోటీదారు తన సమానుడితో స్పర్థకన్నా “గెలువు /గెలువు” అనే వైఖరితో పరస్పరం సహకరించుకోవడం ఉత్తమం.

ప్రస్తుతం దేశంలోని వ్యాపార రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమాంతం పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారతీయ సంస్థలతో సహకారం ప్రాతిపదికగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దపెద్ద అంతర్జాతీయ సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. దాని వల్ల వాటికి కొనుగోలు సామర్ధ్యం కలిగిన దేశంలో అమ్మకాలను సాగించేందుకు అవకాశం కలుగుతుంది. మన యువతకూ ఉపాధి లభిస్తుంది.

మన ప్రభుత్వానికీ ఆదాయమూ పెరుగుతుంది. భాగస్వామ్యం వల్ల అలా రెండు వైపులా లాభం జరుగుతుంది. అలాంటి అవకాశాలు ఏర్పడినప్పుడు “నీవు గెలువు.. నన్ను గెలవనివ్వు” అనే ప్రాతిపదిక ఉత్తమ ఫలితాలను ఇవ్వడమే కాక వినియోగదారునికీ ఉత్తమశ్రేణి సేవలు అందుతాయి. సంస్థలకూ ఆధునిక సాంకేతికత అందివస్తుంది. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ, నాణ్యతతో కూడిన అధికమైన ఉత్పత్తి సాధించ గలుగుతాం.

తద్వారా ఉత్పాదకత పెరుగుతుం ది. వ్యాపారం రెండు సంస్థలకు లాభదాయకంగా ఉండడమే కాక.. అభ్యుదయాన్నీ ఇస్తుంది. ఈ ప్రక్రియలో ముందుగా.. మనకే రంగంలో నైపుణ్యం ఉన్నదో స్పష్టత అవసరం.. మన ఆర్థిక స్థితి పట్ల సరైన అవగాహన ఉండాలి. మనతో భాగస్వామ్యం కోరే సంస్థ విశ్వసనీయత, పనివిధానం, నిర్వహణా దక్షత, సమర్థత, పారదర్శకత పట్ల సరైన సమాచారం సేకరించగలగాలి.

ఒకరికొకరు సహకరించుకునే సంస్కృతి ఉండాలి. ముఖ్యంగా వ్యాపారంలో ఎప్పు డూ లాభాలు మాత్రమే రావు.. అప్పుడప్పుడు నష్టాలు చవిచూడాల్సి రావొచ్చు.. దానిని సహృదయతతో స్వీకరించగలిగిన సహనశీలత రెండు సంస్థలకూ ఉండాలి.

అనుక్షణం అప్రమత్తత అవసరం..

భాగస్వామ్యం సమానస్కందుల మధ్యే పరిమళిస్తుంది. బలహీనుడు బలవంతునితో చేసే స్నేహం ఆత్మగౌరవాన్ని తాక ట్టుపెట్టే పరిస్థితికి దారి తీయవచ్చు. బలం.. ఎప్పుడూ బలాన్ని గౌరవిస్తుంది. పేదరికంలో ఉన్న యజమానిని భార్యాపిల్లలు కూడా గౌరవించరని చెపుతారు. సంపద కలిగిన లక్ష్మీదేవి తన సోదరి జ్యేష్ఠాదేవిని ఆదరించదని పెద్దలు చెపుతారు.

అడవిలో కార్చిచ్చు ప్రళయభీకరంగా ఆవరించిన సమయంలో వాయువు కూడా దానికి సహకరిస్తుంది. అదే అగ్ని చిన్న దీపంగా వెలుగుతున్న సమయంలో గాలి దానిని ఆర్పివేస్తుంది. అది సహజం. ఆర్థికంగా సామాజికంగా బలవంతుడై పదవిలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని పొందుతాడు. అదే వ్యక్తి ఆర్థికంగా నష్టపోయి, పదవీచ్యుతుడై, బలహీనుడైతే అతని బంధుగణమే అతనిని పట్టించుకోదు.

అది సరైనది కాదు.. అక్రమమైన విధానం అన డం సరైనది కాదు. అక్రమ విధానమూ జీవితంలో భాగమే. ప్రపంచమైనా, జీవితమమైనా అలాంటిదే. కాబట్టి బలంగా ఎదిగి, సమానమైన పోటీదారునితో భాగస్వామ్యం పెట్టుకుంటే ఇరువురూ ఎదుగుతారు. మొసలి ఎప్పుడూ మొసలిగానే ఉంటుందనే భయంతో ఇతరులను అనుమానిస్తూ అవకాశాలను వదులుకోవడ మూ సమంజసం కాదు. అయితే.. అనుక్షణం అప్ర మత్తంగా, జాగ్రత్తగా ఉండడం ఉత్తమం.

సన్నివేశాన్ని చూసే దృక్పథంతోనే ఫలాలు..

చూసే విధానాన్ని బట్టి భాగస్వామ్యం ఒక అవకాశం.. అలాగే ఒక సమస్య కూడా. ఒక ఉన్నత విద్యావేత్త ఉద్యోగం కోసం వెతికివెతికి చివరకు తన విద్యార్హతలకు సరిపోని పత్రికారంగంలో జర్నలిస్ట్‌గా చేరాడు. మొదటి రోజు ఎన్నో ఆలోచనలతో.. బెరుకుతో ఉద్యోగానికి వెళ్లాడు. ముఖ్య సంపాదకుడు అతడిని పిలిచి ‘ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం కదా.. నౌకాదళం ఓ నావలో వేడుకలు నిర్వహిస్తున్నది.

నువ్వు అక్కడికి  వెళ్లి ఆ వార్తను సేకరించు’ అని పని అప్పగించాడు. ఉద్యోగంలో మొదటిరోజు, మొదటి బాధ్యత.. ముఖ్య సంపాదకుడు చెప్పింది చేసి తీరాలి.. అనుకున్న యువకుడు ఉత్సాహంగా వెళ్లాడు. తీర యువకుడు అక్కడికి వెళ్లేసరికి నావకు అడుగున రంధ్రంపడి, నావలోకి నీళ్లొస్తున్నాయి. నౌకదళం దానిని బాగుచేసే పనిలో ఉన్నారు. అందువల్ల తానే వార్తనూ సేకరించలేక తిరిగి ఆఫీసుకు వచ్చాడు.

యువకుడి ముఖం చూసి.. పక్కనే ఉన్న మరొక ఉద్యోగి ‘ఏమయింది’ అని అడిగాడు. యువకుడు అతడికి జరిగింది చెప్పాడు. వెంటనే ఆ ఉద్యోగి ‘ఆరెరే అదే మొదటిపేజీలో రావలసిన వార్త..’ అంటూ వెంటనే హార్బర్ కు వెళ్లి సంబంధిత అధికారులతో ముచ్చటించి వివరాలు సేకరించాడు.

అత్య ద్భుతమైన వార్తను రాశాడు. సన్నివేశం ఒకటే.. ఒకరు సమస్యగా చూశారు.. మరొకరు అవకాశంగా చూశారు. అందుకని భాగస్వామ్యాన్ని అవకాశంగా చూడడం, మలుచుకోవడం తెలిసిన సంస్థలు పరస్పరం సహకరించుకుంటూ సమస్యలను అధిగమిస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటేనే ఉన్నత ఫలితాలు వస్తాయి.

సహకారం, నమ్మకమే ప్రతిపాదిక కావాలి..

పరస్పర సహకారం పెద్ద సంస్థల మధ్యనే ఉండాల్సిన అవసరం లేదు. సరఫరాదారు.. చిల్లరవ్యాపారి మధ్యకూడా ఉండవచ్చు. రైతులకు వ్యవసాయ ఫలితాన్ని అందించే వ్యాపారులకు మధ్య కూ డా ఉండవచ్చు. దాని వల్ల రైతులకు తమ ఉత్పత్తులను వ్యాపారులకు విక్రయించే అవకాశం ఉంటుంది. అలాగే చిల్లరవ్యాపారికి కుదుర్చుకున్న ధరకు నాణ్యమైన ఉత్ప త్తి సేకరించుకునే అవకాశం ఉంటుంది.

అలా ఇరువైపులా లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇరువురి మధ్య పారదర్శకత, సహకారం, నమ్మకం ప్రాతిపదికగా కొనసాగే వ్యాపార భాగస్వామ్యం ఎప్పటికీ ల బ్ధిచేకూరుస్తూనే ఉంటుంది. అదే భాగస్వామ్యం నాణ్యత, నిరంతర సరఫరాను కొనసాగిస్తుంది. ఇరువురికీ అభ్యుదయ మూ కలుగుతుంది. వినియోగదారునికి నాణ్యమైన న్యాయమైన ధరలో సరుకు ల భిస్తుంది.

అలాకాకుండా ఒకరినొకరు మో సం చేసుకోవాలని చూస్తే ఇరువురూ నష్టపోతారు. బంధాలను తెంపుకోవడం చా లా సులువు. కానీ, కలుపుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. నమ్మకం కేంద్రంగా ఏ ర్పడిన భాగస్వామ్యాలను పెంచుకోవడం ఉత్తమమైన మార్గం. ఇద్దరి భాగస్వామ్యం లో అపోహలు, అభిప్రాయ భేదాలు రావడమనేది సహజం. అయితే.. వాటిని ఎప్ప టికప్పుడు చర్చించుకుంటూ, పరిష్కరించుకోవడం వల్ల బంధాలు కలకాలం నిలుస్తా టయి.

సమస్య ఉన్నచోటే పరిష్కారం ఉం టుంది. మన దృష్టిని బట్టి అది సమస్యా? అవకాశమా? అనేది నిర్ణయమవుతుంది. నిబద్ధతతో గెలువు/ గెలువనివ్వు అనే వైఖరితో కలిసిన బంధం భాగస్వాములకు, వి నియోగదారులకు ఉపకరిస్తుంది. తద్వారా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.. సంస్థలూ అభ్యుదయాన్ని సాధిస్తాయి.

పాలకుర్తి రామమూర్తి