29-07-2025 01:15:54 AM
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
మంచిర్యాల, జూలై 28 (విజయక్రాంతి) : ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుప త్రి, ఓం సాయి ప్రైవేట్ ఆసుపత్రిని, మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, బెల్లం పల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర టీం సభ్యులు శ్రీనివాస్, జితేందర్‌తో కలిసి తనిఖీలు చేశారు. ఆసుపత్రులలో వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి, వైద్య సదుపాయాలు, సంక్రమణ వ్యాధులు, కీటక జనిత వ్యాధులు,
వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా, అందుబాటులో ఉంటున్నారా, ఆసుపత్రుల లో సరిపోయే విధంగా మందులు అందుబాటులో ఉన్నవి, లేనివి, ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన నిధులు, వాటి వివరాలు, వైద్యులు, వైద్య సిబ్బంది ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఆహారం, సిబ్బంది ద్వారా ఎలాంటి సమస్యలైనా ఏర్పడుతున్నాయా, ఇంకా ఎలాంటి చికిత్సలు కావాలని ఆయన అడిగి తెలుసుకున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లా ఆసుపత్రిలో తిరిగినప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్ అజ య్ కుమార్ సిబ్బందికి ఆదేశించారు. రోగు ల వివరాలను రోజువారిగా నమోదు చేయాలని, డెంగీ, చికెన్ గున్యా లాంటి వారి వివరాలను వెంటనే డీఎం అండ్ హెచ్‌ఓకు తెలియజేయాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల వివరాలు, వారి అటెండెన్స్, ప్రస్తుతం పని చేస్తున్న వైద్యుల వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఓం సాయి ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించి అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో స్ట్రెక్చర్లు, వీల్ చేర్లు, రోగుల నుంచి తీసుకుంటున్న డబ్బుల వివరాలు తెలుసుకున్నారు. మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు వైద్య సిబ్బంది ద్వారా అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తనిఖీలలో బృంద సభ్యులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిచంద్ర రెడ్డి, ఆర్‌ఎంఓలు, డిపిఓ ప్రశాంతి, డిపిహెచ్‌ఎల్ పద్మ, సుమన్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, ఎంటిఎస్ సంతోష్, వెంకట సాయి, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వంద పడకల ఆసుపత్రి తనిఖీ
బెల్లంపల్లి అర్బన్, జూలై 28 : బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆరోగ్య వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలపై వాకబు చేశారు.
మలేరియా, డెంగ్యూ విష జ్వరాల నియంత్రణకు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య సేవలను సమర్వయంతో అమలు చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రిని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట డి సి హెచ్ ఎస్ కోటేశ్వరరావు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ జి రవి వైద్యులు, వైద్య విధాన పరిషత్ అధికారులు ఉన్నారు.
డెంగ్యూ, మలేరియా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
లక్షేట్టిపేట, జూలై 28 : డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వైద్యులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కొరతను జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని అతి త్వరలో భర్తీ చేస్తామన్నారు.
ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వాటిపై నిర్లక్ష్యంగా ఉండకూడదని సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ కు సూచించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గైనకాలజిస్ట్, స్కానింగ్, ఇతర టెస్ట్‌లు అన్ని అందుబాటులో ఉన్నాయని వివరించారు. అనంతరం పలు వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్స్ సురేష్, వైద్య సిబ్బంది ఉన్నారు.