5 March, 2026 | 7:57 AM

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి

05-03-2026 12:13 AM

ఆలేరు, మార్చి 4 : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ ఆసుపత్రిలోని ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎంత మంది డాక్టర్ లు, సిబ్బంది ఉన్నారని సంబంధిత అధికారులను అడిగి, ప్రతిరోజు సగటున ఎంతమంది ఇన్ పేషెంట్‌గా అడ్మిట్ అవుతున్నారని తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో ఉన్న వార్డు లను కలియ తిరిగి, ఇన్ పేషెంట్‌తో కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా, మంచి ఆహారం పెడుతున్నారా అని ఆరా తీశారు.  గర్భిణీ స్త్రీలకు  మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించి, సమయ పాలన పాటించాలని సూచించారు.  ఆసుపత్రి సూపర్డెంట్ పాండు నాయక్, డాక్టర్స్ సిబ్బంది, సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.