5 March, 2026 | 4:51 AM

హైకోర్టులో బాంబు.. పుకార్లే

05-03-2026 12:13 AM
  1. ఆకతాయిల పనే అని తేల్చిన పోలీసులు 
  2. ఊపిరి పీల్చుకున్న సిబ్బంది 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు ప్రాంగ ణంలో తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామంటూ ఆకతాయిలు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడటంతో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టి.. చివరకు అదంతా ఉత్తుత్తి బెదిరింపే నని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రెండున్నర గంటల పాటు టెన్షన్.. టెన్షన్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం హైకోర్టుకు ఓ గుర్తుతెలియని ఈ-మెయిల్ వచ్చింది. అందులో కోర్టు ఆవరణలో బాంబు అమర్చినట్లు దుండగులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అప్రమత్తమైన కోర్టు అధికారులు ఉద యం 11 గంటల సమయంలో చార్మినార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసు యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. చార్మినార్ ఏసీపీ పి.చం ద్రశేఖర్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ రాం బాబు తన పోలీసు బృందాలతో పాటు బాంబ్ , డాగ్ స్క్వాడ్‌లను వెంటేసుకుని హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు.

సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు ఆవరణను, పార్కింగ్, ఇతర అనుమానాస్పద ప్రాంతాలను అణువణువూ క్షుణ్ణం గా తనిఖీ చేశారు.ఎంత వెతి కినా ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఆ మెయి ల్ కేవలం నకిలీదని పో లీసులు నిర్ధారించారు. దీంతో అప్పటివరకు తీవ్ర ఆందో ళనలో ఉన్న అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ప్రశాం తంగా ఊపిరి పీల్చుకున్నారు.

నాంపల్లి కోర్టుకూ గతంలో నాలుగుసార్లు..

ఇలాంటి నకిలీ బెదిరింపులు నగరంలో ఈ మధ్యకాలంలో సాధారణంగా మారిపోయాయి. గత రెండు నెలల వ్యవధిలోనే నగరంలోని నాంపల్లి కోర్టుకు సైతం ఆకతాయిలు ఏకంగా నాలుగు సార్లు ఇదే తరహాలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఈ-మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ను ట్రేస్ చేసి, సదరు ఆకతాయిలను గుర్తించే పనిలో పడ్డారు. తప్పుడు సమాచారంతో కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించి, భయాందోళనలు సృష్టించిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చార్మినార్ ఏసీపీ పి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు.