17-12-2025 10:56:45 PM
ఆదిలాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : జిల్లాలో తుది పల్లెపోరు ప్రశాం తంగా ముగిసింది. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల సంగ్రామం ఎట్టకేలకు ముగిసాయి. బుధవారం జిల్లాలోని తలమడుగు, గుడిహ త్నూర్, బజార్హత్నూర్, సోనాల, బోథ్, నేరడిగొండ ఇలా ఆరు మండలాల్లో ఎన్నికలు జరగగా, జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టగా, పోలీస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
3వ విడత ఎన్నికల్లో మొత్తం 156 పంచాయతీ లు ఉండగా, అందులో ఇప్పటికే 35 పంచాయతీ లు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 121 పంచాయితీ లకు, 1009 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సజావుగానే సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారం భించారు. ఎన్నికలు జరిగే మండలాల పరిధిలో 1,24, 880 ఓటర్లు ఉండగా.. 1,03,104 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇందులో పురుషులు 60744 మంది ఓటర్లకు గాను 50597 మంది ఓటు వేశారు. మహిళలు 64,234 మంది ఓటర్లు ఉండగా.. 52,507 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ఆయా పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తూ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. దీంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. మూడో విడతలో సైతం పలు పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా తయారు చేశారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో సెల్ఫీ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఓటర్లతో కలిపి సెల్ఫీ పాయింట్లు వద్ద ఫోటోలు దిగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
చలిని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన ఓటర్లు..
పల్లెల్లో చలి తీవ్రత ను సైతం లెక్క చేయకుండా ఉదయం 7 గంటల నుండే ఓటర్లు క్యూ లైన్ లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం వేళ ఓటర్లు పెద్ద సంఖ్యలో రాగా... ఆ తర్వాత క్రమంగా ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు సైతం ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు ఇతరుల సహకారంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. ఆ తర్వాత రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా... తొలుత వార్డు మెంబర్ల కౌంటింగ్ ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ పూర్తి చేశారు.