కల్లోల సిరియా!
సిరియాలో మరోసారి అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా దేశంలో సాగుతున్న హింసాకాండలో వెయ్యిమందికి పైగా మరణించినట్లు చెబుతున్నారు. వీధుల్లో ఎక్కడ చూసిన శవాలే దర్శనమిస్తున్నాయని అక్కడ అంతరుద్ధా న్ని పర్యవేక్షిస్తున్న సంస్థలు చెబుతున్నాయి. దేశాన్ని స్వాధీనం చేసుకున్న కొత్త ప్రభుత్వానికి, మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణలే ఈ మారణకాండకు కారణంగా చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లోనే సిరియాలో అధికార మార్పిడి జరిగింది. అబూ మహమ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హెచ్‌టీఎస్ (హయత్ తహ్రీర్ అల్ షామ్)తిరుగుబాటు సంస్థ దేశ రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకోవడంతో బషరల్ అల్ అసద్ దేశం వదిలి పారిపోయారు. జులా నీ అప్పుడు తనను తాను దేశ కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ ప్రభుత్వానికి చాలా దేశాలు మద్దతుగా నిలిచాయి కూడా.
కానీ రెండు నెలలకుపైగా శాంతి తర్వాత తిరిగి వివాదం మొదలైంది. దేశంలో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు అసద్‌కు బలమైన ప్రాంతంలో హింస చెలరేగింది. నివేదిక ప్రకారం సున్నీ ముష్కరులు అసద్ ప్రాంతంలోని అలావైట్ మైనారి టీలపై నిత్యం దాడులు చేస్తూనే ఉన్నారు. అలావైట్ అనేది మైనారిటీ షియా ముస్లింలలో ఒక శాఖ, అసద్ కూడా అలావైట్ కమ్యూనిటీనుంచే వచ్చారు. అసద్ ప్రభుత్వంలో ఈ వర్గం కీలక పదవుల్లో కొనసాగారు.
అంతేకాదు అలావైట్ అసద్ పాలనకు దశాబ్దాలుగా మద్దతు ఇస్తోంది. ఇదే ఇప్పుడు ఈ ఘర్షణలకు మూలకారణంగా చెబుతున్నారు. అలావైట్ సమాజం ఆధిపత్యం వహించే గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను సున్నీలు ఊచకోత కోసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భయంకరమైన హింసకు వ్యక్తిగత చర్యలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. సిరియా చరిత్రను గమనించిన వారికి ఇక్కడ అంతర్యుద్ధం ఇప్పటిది కాదని అర్థమవుతుంది.
2000లో అసద్ తన తండ్రినుంచి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటినుంచి ప్రజా ఆందోళనలు అణచివేయడానికి సైన్యాన్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారు. ఆధునిక వాదిగా, సంస్కరణ వాదిగా గుర్తిం పు పొందిన అసద్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి బాటలోనే ప్రజా అసమ్మతిని అణచివేయడానికి సైన్యాన్ని ఉపయోగించడం కొనసాగించారు. అదే దేశంలో ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకు బీజం వేసింది.
2011లో ప్రతిపక్ష మిలీషియా గ్రూపులు ఏర్పాటు కావడం మొదలైంది. 2012 నాటికల్లా ఇది పూర్తిస్థాయి అంతర్యుద్ధంగా మారింది. అసద్ పాలనలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారగా, సామాన్య ప్రజ ల బతుకులు మరింత దుర్భరంగా మారాయి. దీనికితోడు అరబ్ దేశాల్లో వచ్చిన తిరుగుబాట్లు టునీసియా, ఈజిప్టులలో అధ్యక్షుల మార్పునకు దారి తీసింది. ఇది కూడా కూడా సిరియా ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఆశలు చిగురించేలా చేశాయి.
మరోవైపు 200710 మధ్య దేశంలో వచ్చిన తీవ్రమైన కరువు దాదాపు 15 లక్షల మంది గ్రామాలనుంచి పట్టణలకు వలసవెళ్లేలా చేసింది. ఇది దేశంలో పేదరికం, సామాజిక అశాంతి పెరిగిపోవడానికి కారణమయింది.
దీనికితోడు అటు తిరుగుబాటుదారులకు అమెరికా, టర్కీ లాంటి దేశా లు పరోక్షంగా అందించిన ఆయుధ సహాయం, ఇటు అసద్‌కు రష్యా అండగా నిలవడంతో అంతర్యుద్ధం దాదాపు 12 ఏళ్ల పాటు కొనసాగింది. అంతర్యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా. అయితే 2024లో తిరుగుబాటు దళాలు ఒక్క తాటిపైకి వచ్చి ఒక్కొక్కటిగా దేశంలోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవడం,
అసద్ సైన్యాలు వెనక్కి తగ్గుతూ రావడంతో ఊహించిన దానికన్నా తక్కువ సమయంలోనే సిరియా తిరుగుబాటుదారుల వశమైంది. అసద్ దేశం వదిలి పారిపోయారు. అసద్ పాలన పతనమైందని తిరుగుబాటుదారులు ప్రకటించడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటేనని,దేశం మరోసారి అంతర్యుద్ధంలోకి జారుకొంటోందని తాజా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఈ రక్త చరిత్రకు ముగింపు ఎప్పుడో!






