04-07-2025 01:41:43 AM
ముషీరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల, ఆసరా పెన్షన్ దారుల పెన్షన్లు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్ పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఆగస్టు 13న ఎల్.బి స్టేడియంలో వికలాంగుల, ఆసరా పెన్షన్ దారుల మహాగ ర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విహెచ్ పిఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ తో కలసి ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా వికలాంగుల పెన్షన్లను రూ.6 వేలు, ఇతర ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలన్నారు.
తీవ్ర వైకల్యంతో(మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధి) బాధపడుతున్న వికలాంగులకు రూ.15 వేల పెన్షన్ మంజూరు చేయాలన్నారు. పెన్షన్ల పెంపుదల కోసం జూలై 7న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల సమర్పించనున్నట్లు తెలిపారు.
పెన్షన్ దారుల కోపాన్ని ఓట్లుగా దండుకోవచ్చనే నీచమైన బుద్ధితో బిఆర్‌ఎస్ పార్టీ ఉందని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒక్కసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేదని అన్నారు. ఈ సమావేశంలో విహెచ్ పిఎస్ నాయకులు ఎల్.గోపాల్ రావు, అందె రాంబాబు, సామినేని భవానీ చౌదరి, చెరుకు నాగభూషణం, కాళ్ళ జంగయ్య, కొల్లి నాగేశ్వర్ రావు, మురిగాడి నర్సింహా, వెంకట్ రెడ్డి, బి.కె.నర్సింహా, వంశరాజ్ రాంచందర్ పాల్గొన్నారు.