04-07-2025 01:41:48 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఆర్థిక ప్రగతిలో పారిశ్రామికాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. అయితే ఫ్యాక్టరీల్లో సంభవించే ప్రమాదాలు పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా మారు తున్నాయి. దీనికి తోడు అనేక మంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇటీవల కాలంలో ఈ పారిశ్రామి క ప్రమాదాలు తరచూ సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో పారిశ్రామిక ప్రమాద బాధితుల్లో స్థానికుల కంటే అధికంగా ఇతర రాష్ట్రాల కార్మికులే ఉంటున్నారు. ఉపాధి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికులను పారిశ్రామిక ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాం తంలో ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో 40 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ చాలా మంది స్థానికే తరులే ఉన్నారు. అయితే పేలుళ్లు సంభవించి కార్మికులు గాయపడటం, మరణిం చడం వంటి దుర్ఘటనలు పెరుతున్న నేపథ్యంలో ప్రమాదాల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అయితే పరిశ్రమల స్థాపన ఎంతో అవసరమైనప్పటికీ వాటిలో పాటించాల్సిన భద్రతా చర్యలు కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో తరచూ సంభవించే పారిశ్రామిక ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రియాక్టర్ పేలుళ్లు, రసాయన లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సంభవించిన భారీ పేలుడు ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరుస ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుండటంతో పారిశ్రామిక భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రతీ పారిశ్రామిక ప్రమా ద ఘటనపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిం ది. ప్రమాదాలకు కారణాలు గుర్తించి మళ్లీ పునరావృతం కాకుండా దీర్ఘకాలిక చర్యలను సూచించేందుకు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నది. కార్మికులకు మెరుగైన భద్రతా వ్యవస్థ, ప్రమాదాల సమాచారం త్వరగా సంబంధిత అధికారులకు చేరేలా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పదేళ్లలో 10 వేలకుపైగా..
గత పదేళ్లలో దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన కర్మాగారాల్లో సంభవించిన ప్రమాదాల్లో 10వేలకు పైగా మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 97 వేలకు పైగా కార్మికులు గాయపడ్డారు. కార్మికుల ప్రాణాలు పోవడంతో పాటు ప్రమాదాల కారణంగా పర్యావరణా నికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. 2010 నుంచి 2020 మధ్యలో పర్యావరణాన్ని దెబ్బతీసిన ప్రమాదాలు మన దేశంలో 560 జరిగాయని పరిశోధకుల పలు అధ్యయనాల్లో తేలింది.
దేశవ్యాప్తంగా ముప్పు కలిగిన ఫ్యాక్టరీలు వేలల్లో ఉన్నాయి. అయితే 2021లో దేశంలోని మొత్తం సాధారణ పరిశ్రమల్లో 15 శాతం పరిశ్రమల్లో కూడా తనిఖీలు జరగలేదు. సరైన తనిఖీలు లేకపోవడం, పర్యవేక్షణ లోపించడంతో దేశవ్యా ప్తంగా అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్పష్టమతు న్నది. బాయిలర్ల నిర్వహణ వంటి పనులను శిక్షణ లేని కార్మికులకు అప్పగించడం, కీలక యంత్రాలను పట్టించుకో కపోవడం వంటి యాజమాన్యాల తప్పులతో భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు.. రసాయన ప్రతిచర్యలతో పేలుళ్లు..
పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియలకు రసాయన పదార్థాల వాడకం అనివార్యం. కొన్నిసార్లు ప్రమాదకరమైన రసాయనాలను కూడా ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. ఇవి ఒకదానితో ఒకటి చర్యలకు లోనై అధిక ఉష్ణోగ్రతలు, పీడనాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ పరిణామాలు నియంత్రణకు అందకుండాపోతే, రియాక్టర్లలో అధిక ఒత్తిడితో పేలుళ్లు సంభవించవచ్చు. ముఖ్యంగా ఉష్ణాన్ని వెలువరిస్తున్న ప్రతిచర్యలను సరైన విధంగా చల్లబరచకపోతే ప్రమాదం తప్పదు.
రసాయన మిశ్రమాల వల్ల జరిగే ప్రమాదాలు..
ప్రత్యేకించి, రెండు ప్రమాదకర రసాయన పదార్థాలు కలిసినప్పుడు దాని వల్ల తీవ్ర ప్రతిచర్యలు, వేగంగా జరిగే మార్పులు సంభవిస్తాయి. ఇది గాఢ ఉష్ణం, వాయువు విడుదలతోపాటు తీవ్ర స్థాయి పేలుళ్లకు దారి తీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరాక్సుడ్‌లు వంటి కొన్ని పదార్థాలు స్వభావతః అస్థిరంగా ఉండి చిన్న ఉష్ణ మార్పులకు సైతం ప్రతిస్పందించి పేలిపోతాయి.
ఎయిర్‌ప్రెషర్ పెరగడంతో..
కొన్నిసార్లు ఉత్పత్తిలో వాడే వాయువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని సురక్షితంగా వెలుపలికి విడుదల చేయకపోతే, అవి కంటెయినర్లలో గట్టిగా తడబడతాయి. ఈ ఒత్తిడిని రియాక్టర్లు తట్టుకోలేక పేలిపోవడం జరుగు తుంది. పీడన నియంత్రణ వ్యవస్థలు పనిచేయకపోతే ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.
పరికరాల్లో లోపాలు..
పాత పరికరాలు వాడటం, రద్దీగా పనిచేయడం, సమయానికి నిర్వహణ చేపట్టకపో వడం వంటి కారణాలతో పరికరాల్లో లోపాలు ఏర్పడి అవి అధిక ఒత్తిడి లేదా ఉష్ణోగ్రతలను తట్టుకోలేక పేలిపోతాయి. పైప్‌లైన్లు, స్టోరేజ్ ట్యాంకులు, బాయిలర్లు ఇలా అనేక పరికరాల్లో చిన్న చిన్న లీకేజీలు, తుప్పు, లోపాలు ఏర్పడి పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు.
మిషనరీ ఫెయిల్యూర్..
పంపులు, కంప్రెషర్లు, కూలింగ్ సిస్టమ్స్ వంటి ప్రధాన యంత్రాలు పనిచేయకపోతే రియాక్టర్ లోపల ఉష్ణోగ్రత నియంత్రణకు అవరోధం ఏర్పడి పేలుళ్లకు దారితీస్తుంది. ఎప్పటికప్పుడు యంత్రాలను తనిఖీ చేసి, అవి సరిగా పనిచేస్తున్నాయా అనే విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరం.
సేఫ్టీ వాల్వుల ఫెయిల్యూర్..
రియాక్టర్లు, బాయిలర్లు వంటి పరికరాలలో పీడనాన్ని నియంత్రించేందుకు సేఫ్టీ వాల్వులు ఏర్పాటు చేస్తారు. ఇవి పనిచేయకపోతే అధిక పీడనం ఇన్స్టాలేషన్‌ను దెబ్బతీ స్తుంది. ఫెయిలైన వాల్వుల వల్ల యంత్రాలు పేలిపోవడం కచ్చితంగా సాధ్యమే.
ప్రెషర్ కంట్రోలర్స్ ఫెయిల్యూర్‌తో..
బాయిలర్లు, కూలింగ్ సిస్టమ్‌లు, రియాక్టర్లు మొదలైన పరికరాలు గరిష్ట పీడనానికి సమానంగా తయారు చేస్తారు. వాటిలోని సెన్సార్‌లు, సేఫ్టీ మెకానిజమ్‌లు సక్రమంగా పనిచేయకపోతే ఆ అధిక పీడనం వల్ల యంత్రం పేలిపోవడం జరుగుతుంది. పైగా, పీడన నియంత్రణ లోపాలు ప్రమాద తీవ్రతను పెంచుతాయి.
విద్యుత్ లోపాల వల్ల ప్రమాదాలు..
పరిశ్రమల్లో విద్యుత్ సరఫరాలో చిన్న చిన్న పొరపాటే పెద్ద విపత్తులకు దారి తీస్తాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినప్పుడు పక్కనే ఉన్న మండే స్వభావం గల పదార్థాలు, వాయువులు అగ్నికి ఆహుతి కావచ్చు. పాత వైర్లు, లోపభూయిష్టమైన విద్యుత్ పరికరాలు, అధిక లోడ్ వలన ఈ ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి.
నిబంధనల అమలుకు కఠిన చర్యలు
ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే లైసెన్సుల రద్దు, జరిమానాలు విధించడం, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలకు వెనకాడొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక యూనిట్లలో, ముఖ్యంగా హై రిస్క్ క్యాటగిరీ కిందకు వచ్చే ఫార్మాస్యూటికల్స్, కెమికల్ ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి ఒక కఠినమైన యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
ప్రతి రెండు నెలలకు ఒకసారి యూనిట్లలో సమగ్ర సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలను ఫ్యాక్టరీల డైరెక్టరేట్, కాలుష్య నియంత్రణ మండలి ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నలుగురు శాస్త్రవేత్తలతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ఈ కమిటీ సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి దారి తీసిన కారణాలు గుర్తించడం, కార్మికుల భద్రత కోసం తీసుకున్న చర్యలు, యాజమాన్యాలు అనుసరించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తు న్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అనే అంశాలపై అధ్యయనం చేయనున్నది. భవిష్యత్‌లో కెమికల్, ఫార్మా పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను కమిటీ సిఫార్సు చేయనున్నది.
నిర్లక్ష్యం, నైపుణ్య లేమితో జరిగే ప్రమాదాలు..
కార్మికులు, సిబ్బంది సరైన శిక్షణ లేకపోవడం, భద్రతా నిబంధనలను పాటించకపో వడం కూడా ప్రమాదాలకు మూలకారణం. బాయిలర్లు, రియాక్టర్లు వంటి ప్రదేశాల్లో పని చేసే వారికి ప్రాథమిక అవగాహన లేకపోతే వారు ప్రమాదకర పరిస్థితులను గుర్తించలేరు. పరికరాలను నిర్వాహకులు సమయానికి మార్చకపోవడం, దెబ్బతిన్న రసాయన పదార్థాలను నిర్లక్ష్యంగా నిల్వ చేయడం, వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించకపోవడం వంటి విషయాలూ మానవ తప్పిదాలను పెంచుతున్నాయి.
ఈ విధంగా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న పేలుళ్లు అనేక కారణాలవల్ల ఏర్పడుతున్నాయి. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోతే ప్రాణ నష్టం తప్పదు. పరిశ్రమ యాజమాన్యం నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పాశమైలారంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి. పరిశ్రమలో కాలం చెల్లిన రియాక్టర్‌ను వినియోగించారు. నైపుణ్యం లేని కార్మికులతో పనులు చేయించారు.
అందుకే ఇంతటి ప్రమాదం వాటిల్లింది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కేంద్రం ప్రకటించిన రెండు లక్షలు కాకుండా రూ.25లక్షలు అందించాలి. ఘటన నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్న శిథిలాల తొలగింపు నెమ్మదిగా కొనసాగుతోంది. త్వరగా శిథిలాలను తొలగించి మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించాలి.
- కే రాజయ్య, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు
మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి
పాశమైలారంలో జరిగిన దారుణం యావత్ దేశాన్ని కుదిపేసింది. కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై మృతుల సంఖ్యను స్పష్టం చేయడం లేదు. కార్మిక శాఖ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, ప్రభుత్వ పట్టింపులేనితనం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది. ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు తక్షణమే కోటి రూపాయలు అందించాలి. క్షతగాత్రుల కుటుంబాలకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కంపెనీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నది.
- సిలువేరి వీరేశం, బీఆర్‌టీయూ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ప్రమాద ఘటనకు పరిశ్రమ యాజమాన్యమే బాధ్యత వహించాలి. మృతి చెందిన కార్మికులకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలి. పరిశ్రమ ప్రకటించిన పరిహారాన్ని కూడా వెంటనే అందించాలి. ఇలాంటి ప్రమాదాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన పరిశ్రమలపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
- నాగేశ్వర్‌రావు, సీపీఎం పటాన్‌చెరు ఏరియా కమిటీ కార్యదర్శి