వర్షాలతో 16మంది మృతి
ఎనిమిది జిల్లాలపై ప్రభావం
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వర్షాలతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలు, సహాయక చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. మొత్తం ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం పర్యటి స్తారని వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అధికారులంతా క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. విద్యుత్, రహదారులను వెంటనే పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్తున్న సీఎం సోమవారం అక్కడే బస చేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉందని, ఇద్దరు మంత్రు లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కొందరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాజీమంత్రులు, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ రావులకు ఇది రాజకీయం చేసే సమయం కాదని ఆయన హితవు పలికారు. ప్రజల పట్ల బీఆర్‌ఎస్‌కు అభిమానం ఉంటే వరద సహాయక కార్యక్రమాల్లో ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






