ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి..
కలెక్టర్ అంకిత్, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్తగూడెం, మే 7 (విజయక్రాంతి): ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పి సి పి ఎన్ డి టి) చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ,జిల్లాస్థాయి సమీక్ష సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలు, ల్యాబ్ల నిర్వహణ, అనుమతులు, నిబంధనల అమలుపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్లపై కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు.
అనుమతులు లేకుండా లేదా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. వైద్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో ఉన్న లోపాలను గుర్తించి వారికి తగిన సూచనలు అందించాలని ఆదేశించారు. అర్హతలు లేకుండా వైద్యం నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ వైద్యులపై , ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టాన్ని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేయాలని, గర్భ లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉపేక్షించ రాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, , పాల్వంచ డి.ఎస్.పి సతీష్ కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






