07-01-2026 05:46:13 PM
చిట్యాల,(విజయక్రాంతి): అతివేగంతో అజాగ్రత్తగా బైకు నడిపి రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామంలో జాతీయ రహదారి 65 పై మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య(50) టీజి07 ఏసిటీ/ఆర్ 1566 నెంబర్ గల తన సొంత ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ కు వెళుతూ చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో అతివేగంగా అజాగ్రత్తగా బైకు నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద సూచిక బోర్డుకు ఢీకొని అనంతరం చెట్టుకు ఢీకొట్టడంతో మృతిని తలకు బలమైన గాయాలయ్యాయి.
ప్రయాణికులు దీన్ని గమనించి వెంటనే స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించడంతో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి హైదరాబాదులోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.