07-01-2026 05:42:51 PM
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
రోడ్లపై కేజీ వీల్స్ తో వాహనాలు వస్తే భారీ జరిమాణాలు
పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): శాటిలైట్ సర్వే ద్వారా త్వరలోనే అక్రమాలకు బ్రేక్ పడనుందని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, కేజీ వీల్స్ తో వాహనాలు రోడ్డు పైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణ లో కేజీ వీల్స్ వాడకంపై , ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎసిపి గజ్జి కృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎసిపి గజ్జి కృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండగ తర్వాత శాటిలైట్ సర్వే లైన్స్ ఏర్పాటు అవుతాయని, పోలీసులు కార్యాలయాల్లో ఉన్నప్పటికీ వాహనాల ద్వారా ఇసుకతో పాటు ఏలాంటి అక్రమాలకు పాల్పడిన తమకు తెలుస్తుందని, అప్పుడు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు నడపడం కారణంగా రోడ్లు చెడిపోతున్నాయని, ఇకముందు కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తే భారీ జరిమాణాలు విధించడం జరుగుతుందని అన్నారు. అలాగే ట్రాక్టర్ల డ్రైవర్లు , ఓనర్లు మానేరు నుండి ఇసుక సరాఫర ను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేసుకోవాలని అన్నారు.
సమయ పాలన పాటించాలని, సమయం దాటిన తర్వాత ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, సంబంధిత అన్ని పేపర్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్ లు మాట్లాడుతూ... మానేరు వాగు పరిసర గ్రామాలలో అక్రమంగా ఇసుక డంపు లు ఏర్పాటు చేయవద్దని, పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోనే ఇసుక రవాణా జరగాలని వేరే ప్రాంతాలకు తరలి వెళ్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని ఆయా గ్రామాల ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.