దేశభక్తి ఉంటే కచ్చితంగా ఓటు వేస్తారు

08-05-2024 01:38:33 AM

జిల్లాలో పోలింగ్‌కు సర్వసిద్ధం 

జిల్లా వ్యాప్తంగా 3986 పోలింగ్ కేంద్రాలు 

విధులలో 34,809 సిబ్బంది 

14వేల మంది పోలీసులతో భద్రతా చర్యలు 

విధులకు డుమ్మ కొట్టిన 100మందిపై ఎఫ్‌ఐఆర్

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో 13న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉందని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ ఆర్వో అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ కేశవ్ పాటిల్, నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రోనాల్డ్ రోస్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45.91లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. పోలింగ్ విధులకు ఇప్పటి వరకూ 500మంది డుమ్మకొట్టగా, వారిలో 100మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. 

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డు చేయనున్నట్టు రోనాల్డ్‌రోస్ తెలిపారు. అనంతరం ఏ అభ్యర్థి అయినా తమకు రికార్డు ఇవ్వాలంటే అందజేస్తామన్నారు. మహిళలు అసౌకర్యంగా ఉండకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో మహిళా సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 16,776 పోస్టల్ బ్యాలెట్‌లకు దరఖాస్తులు అందగా, ఇప్పటి వరకు 9266మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. ఈ నెల 8వ తేదీతో పోస్టల్ బ్యాలెట్ సమయం ముగుస్తోందన్నారు. ఇంకా ఓటు వేయని వారి కోసం 9, 10తేదీల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ సెంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఓటరు స్లిప్‌లను ఇప్పటి వరకూ 82శాతం పూర్తి చేశామన్నారు. క్యూ మేనేజ్‌మెంట్ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారో ఇంటి వద్ద  ఉండే తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ యాప్‌లో ఓ క్లిక్ కొడితే గూగుల్ మ్యాప్ ద్వారా మనల్నీ పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్తోందని వివరించారు. సాక్ష్యం యాప్ ద్వారా ఫ్రీ పికప్ కోసం 500పైగా దివ్యాంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1046 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు చెప్పారు. వీటిలో 383 కేంద్రాల్లో గతంలో ఓటింగ్ సంబంధిత వివాదాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని అన్నారు. మే 11వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి ఎన్నికలు పూర్త య్యే వరకు నగరంలో 144సెక్షన్ ఉంటుందన్నారు. డీఆర్‌ఎస్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు ఉంటాయన్నారు. మొత్తం 14వేల మంది సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారని సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.