మోదీ మోహంలో యువత

08-05-2024 01:33:41 AM

ఈ పరిస్థితి దేశానికి పెను ప్రమాదకరం

రాజ్యాంగాన్ని నమ్మనిది ఆరెస్సెస్, ఉగ్రవాదులే

ఉద్యోగాల నిరాకరణకే రిజర్వేషన్ల రద్దు కుట్ర

ఓబీసీ పీఎం వల్లే ఓబీసీలకు చీకటి రోజులు

రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (విజయక్రాంతి): యువతలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల వ్యామోహం పెరుగుతుండటం ప్రమాదానికి దారి తీస్తోందని సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి సాదిక్ అధ్యక్షతన ‘భారత రాజ్యాంగం రిజర్వేషన్లు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చెప్తున్నదని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొనేందుకు ప్రధాని మోదీని, ఆరెస్సెస్ భావజాలాన్ని అర్థం చేసుకుని యువత ఓటు వేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని నమ్మనివారు ఆరెస్సెస్, నక్సలైట్లు, తీవ్రవాదులు మాత్రమేనని తెలిపారు. గతంలో రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారు తప్పితే మార్చలేదని గుర్తుచేశారు.

బీజేపీ వస్తే రాజ్యాంగం మనుడగ అనుమానమే

రాజ్యాంగాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నది ఆరెస్సెస్ మాత్రమేనపి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం పాశ్చాత్య విధానంలో ఉందనే భావన బీజేపీ నేతల్లో నెలకొన్నదని.. అందుకే రాజ్యాంగాన్ని మారుస్తామని.. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉంటుందో లేదో అనుమానమేనని పేర్కొన్నారు. సంపదను పెంచాలి తప్పితే, ఉద్యోగాలను ఊడగొట్టే విధానాలు తీసుకురావద్దని హితవు పలికారు. సామాజిక న్యాయం లేని ఆర్థికాభివృద్ధి ఎందుకోసమని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రిజర్వేషన్ల అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం 2024 తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయని అన్నారు. పాలకులు వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని మార్చి పాలకులు అనుకున్న రాజ్యాంగాన్ని తీసుకొస్తే ప్రజలంతా ఏం చేయగలరు అనే అంశంపై ఇప్పుడు చర్చ జరగాలని పేర్కొన్నారు.

పాలకుల్లో ఉచిత విద్య నేరమనే భావన

గతంలో ఎన్‌ఐఏ అధికారులు మానవ హక్కుల కార్యకర్తలు, నక్సలైట్ కుటుంబాల ఇంటికి వెళ్లేవారని.. ప్రస్తుతం ముఖ్యమంత్రుల నివాసాలకు సైతం వెళ్లే పరిస్థితులు వచ్చాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్  అన్నారు. పేద పిల్లలకు ఉచితంగా విద్య అందించడమే నేరమన్న ఉద్దేశంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని విమర్శించారు. అనేక దేశాలు విద్యపైనే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తుంటే.. మనదేశంలో మాత్రం అత్తెసరు నిధులను కేటాయించి, అందరికీ అందాల్సిన విద్యా లక్ష్యాలను నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ సమాజాన్ని చీల్చిందే మనువాదులని దుయ్యబట్టారు. బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్ల ద్వారా వస్తున్న ఉద్యోగాలను ఇవ్వొద్దనే ఆలోచనతోనే రిజర్వేషన్లను రద్దుచేయాలని బీజేపీ చూస్తున్నదని ఆరోపించారు. దేవుడు, ధర్మం, నీతి గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు.

అన్ని వర్గాలు ఏకమై బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సామాజిక అంటరానితనంలో ఉన్నవారికి రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించారని, అజ్ఞానం, దారిద్య్రం, అసమానతలు, కన్నీళ్లు లేని దేశం కావాలని మొదటి ప్రధాని నెహ్రూ ఆకాంక్షించారని ప్రొఫెసర్ కాశీం గుర్తుచేశారు. తొలి ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొంటున్న మోదీ వల్లనే ఓబీసీలకు చీకటి రోజులొచ్చాయని బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సామాజిక వెనుకబాటుకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను ఆర్థిక వెనుకబాటుకు మళ్లించిన ఘనత మోదీకే దక్కిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, సీనియర్ జర్నలిస్ట్ జయసారథిరెడ్డి, కాంగ్రెస్ నేత సంగిశెటి జగదీశ్, జనంసాక్షి ఎడిటర్ రెహమాన్, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక కోశాధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.