రెండు గంటల్లో 49 ఫిర్యాదులు

08-05-2024 01:45:45 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (విజయక్రాంతి) : నగరంలో మంగళవా రం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైనే వరద నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జీహెచ్‌ఎంసీకి చెందిన డిజిస్టార్ రెస్కూట్ ఫోర్స్‌కు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల మధ్యలో (రెండు గంటల వ్యవధి) ప్రజల నుంచి 49 ఫిర్యాదులు వచ్చినట్టు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వీటిలో 32చోట్ల చెట్లు విరిగిపడినట్టుగా, 17 చోట్ల నీళ్లు నిలిచిపోయినట్టుగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. తక్షణమే స్పందించిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లపై నిలిచిన వర్షపు నీరును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అందులో చెట్లు విరిగిన ఫిర్యాదులలో 14చోట్ల పరిష్కరించి, మరో 18చోట్ల పనులు చేపడుతున్నట్టు తెలిపారు. నీళ్లు నిలిచిపోయన ఫిర్యాదులలో 14 పూర్తి చేయగా, మరో 3చోట్ల సిబ్బంది చర్యలు చేపడుతున్నట్టు ఈవిడిఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.