కార్మిక సమస్యలపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా యాజమాన్యానికి కనికరం లేదు
బూర్గంపాడు,(విజయక్రాంతి): కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యానికి పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనికరం లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్ పాషా, బల్లెం నాగయ్యలు మండిపడ్డారు. మంగళవారం 34వ రోజుకు రిలేనిరాహారదీక్షలు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్టీయూ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుందూరు పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వుర్లుగొండ వీరన్నలు కార్మికులకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై ఎండను సైతం లెక్కచేయకుండా నెలరోజులకు పైగా దీక్షలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందని...కార్మిక సమస్యలపై జేఏసీ పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని, మున్ముందు కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం గురికాకతప్పదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం కానుందని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కందాల వెంకటరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.






