దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్
హనుమకొండ,(విజయక్రాంతి): దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలోనే చేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక హోదా మారుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో అంటరానితనం, వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
ఈ దేశంలో బ్రాహ్మణులు, కమ్మలు, కాపులు, రెడ్డి సామాజిక వర్గాల వారు మతం మారినప్పుడు వారి అగ్ర కుల హోదా పోనప్పుడు, వారి సామాజిక గుర్తింపు మారనప్పుడు కేవలం దళితులు మతం మారినప్పుడు మాత్రమే ఎస్సీ హోదాను రద్దు చేయడం వివక్షాపూరితమైన చర్య అని బ్రహ్మయ్య మాదిగ ధ్వజమెత్తారు. కులం అనేది పుట్టుకతో వచ్చే సామాజిక ముద్ర అని, అది మతం మారినంత మాత్రాన తొలగిపోదని పాలకులు గుర్తించాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొక్కల వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్సన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి ఆశీర్వాదం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ ఎడ్ల ఉపేందర్, వరంగల్ జిల్లా ఇన్చార్జ్ దాసరపు సారన్న మాదిగ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు గాద మహిపాల్, రాష్ట్ర నాయకులు సింగారపు చిరంజీవి, గన్నారపు రవి, పాస్టర్స్, అంబాల ఆనంద్, కందుకూరి ఎలిజరు, పెండ్యాల వరుణ్, తాళ్లపల్లి డేవిడ్, సింగారపు స్వామి సాల్మను జాను వేణు తదితరులు పాల్గొన్నారు.






