31-07-2025 12:34:24 AM
-కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ (భీమారం), జూలై 30: భీమారం మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. బుధవారం పీహెచ్సీ నిర్మాణ పనులను ఎంపీడీవో మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో స్థానిక ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పీహెచ్సీ నిర్మాణాన్ని చేపట్టామన్నారు.
పాఠశాల, ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ...
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎస్.ఐ. శ్వేతతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని శ్రీలక్మి ఫెర్టిలైజర్ దుకాణాన్ని సందర్శించి స్టాకు నిల్వలు, ధరల పట్టిక, రశీదు పుస్తకాలను తనిఖీ చేశారు. రైతులకు విక్రయించిన వాటికి సంబంధించి రశీదు జారీ చేయాలని, దుకాణం ఎదుట ధరల పట్టిక, స్టాకు నిల్వల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కోరారు.
నకిలీ, నిషేధిత విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ అధికారి భుక్య ఛత్రు నాయక్, తహసిల్దార్ సదానందంనలతో కలిసి మండలంలోని దాంపూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పరిసరాలు, ఆహార నాణ్యత, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటుందని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమయానుసారంగా పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి అవసరమైన మందులు, పోషకాహారం అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులున్నారు.