31-07-2025 12:36:26 AM
యూబీఐ కరీంనగర్ రేంజ్ మేనేజర్ అపర్ణారెడ్డి
మంచిర్యాల, జూలై 30 (విజయక్రాంతి) : ఆర్థిక చేరికలు లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో స్యాచురేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కరీంనగర్ ప్రాంతీయ మేనేజర్ అపర్ణారెడ్డి తెలిపారు. బుధవారం హాజీపూర్ మండలంలోని గుడిపేట రైతు వేదికలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, వివిధ బ్యాంకుల మేనేజర్లతో కలిసి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డి.ఎఫ్.ఎస్.) ఆదేశా ల ప్రకారం ఆర్థిక చేరికలు లక్ష్యంగా స్యాచురేషన్ క్యాంపులను దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, అర్హులైన వారు భీమా పథకాలలో చేరాలని, ఉపాధిహామీ పథకం కార్మికులకు ప్రధానమంత్రి ఎస్.బి.వై. భీమా చేయాలని తెలిపారు.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవడానికి అవకాశం కల్పిస్తున్నామని యూబీ ఐ కరీంనగర్ రేంజ్ మేనేజర్ అపర్ణారెడ్డి తెలిపారు. ఈ ఖాతాల తో ఎ.టి.ఎం.ల ద్వారా రూ. 2 లక్షల ప్రమాధ భీమా, పి.ఎం. ఎస్.బి.వై. లో రూ. 20 వార్షిక ప్రీమియంతో ప్రమాద మరణానికి రూ. 2 లక్షల భీమా, పి.ఎం.జె.జె.బి.వై.లో రూ. 436 వార్షిక ప్రీమియంతో సహజ మరణానికి రూ. 2 లక్షల భీమా, ఎ.పి.వై. నెలవారి పెన్షన్ పథకంలో నెలకు వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్ (వయస్సు ఆధారంగా ప్రీమియం) పొందవ చ్చన్నారు. ఆర్.బి.ఐ. మార్గదర్శకాల ప్రకారం ప్రతి 2, 8, 10 సంవత్సరాలకు కె.వై.సి. అప్డేట్ చేసుకోవాలని, బి.సి. పాయింట్లు, బ్యాం క్ శాఖలు, ఎ.టి.ఎం., ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఆర్మ్-కె.వై.సి. చేసుకోవచ్చన్నారు.
సైబర్ క్రైం పట్ల అప్రమత్తంగా ఉండాలి
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రత అవసరమని యూబీఐ కరీంనగర్ రేంజ్ మేనేజర్ అపర్ణారెడ్డి అన్నారు. బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ సంబంధిత ఓ.టి.పి., పాస్వర్డ్, ఎ.టి.ఎం. పిన్ ఎవరితో పంచుకోవద్దన్నారు. రైతులకు, వ్యాపారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు అవసరమైన రుణ సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు 1 కోటి 50 లక్షల రూపాయల రుణం చెక్కును అందజేశారు.
హాజీపూర్ కు చెందిన బ్యాంక్ ఖాతాదారు కంకుల లచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందగా పి. ఎం.జె.జె.బి.వై. భీమా పథకంలో సభ్యుడు కావడంతో 2 లక్షల రూపాయల భీమా మొత్తాన్ని నామినీ కంకుల పోచయ్యకు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఎ.పి.ఎం. రాజన్న, బ్యాంక్ అధికారులు అభిమన్యు, సతీష్, సి.ఎఫ్.ఎల్. కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.