31-07-2025 12:33:02 AM
-కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,జులై 30(విజయ క్రాంతి): సంపూర్ణత అభియాన్ లో జిల్లా బ్లాక్, తిర్యాణి బ్లాక్ ను ఆకాంక్షిత నుండి అభివృద్ధి వైపుకు తీసుకువెళ్లేలా ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సంపూర్ణత అభియాన్‌లో భాగంగా జిల్లా బ్లాక్, తిర్యాణి బ్లాక్ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ లో జిల్లా బ్లాక్, తిర్యాణి బ్లాక్ ను జాతీయస్థాయిలో 5వ ర్యాంక్, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి ర్యాంక్ రావడంతో క్షేత్రస్థాయిలో కృషిచేసిన ప్రతి ఉద్యోగి, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో బ్లాక్ లను ఆకాంక్షిత నుండి అభివృద్ధి దిశలో తీసుకువెళ్లేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. సంపూర్ణత అభియాన్ లో జిల్లా, తిర్యాణి బ్లాక్ లను జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకు రావడంలో కృషి చేసిన వారందరికి ప్రపంస పత్రాలు అందజేశారు.
అంతకుముందు ఆకాంక్షత కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి మార్కెటింగ్ సౌకర్యానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. తిర్యాణి బ్లాక్ మంచి ర్యాంకు సాధించడంలో విశేషంగా కృషి చేసిన సంపూర్ణత అభియాన్ సమన్వయకర్త మణివేలును ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, తిర్యాణి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్, మణివేలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.