09-02-2025 11:22:53 PM
సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య..
ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వ్యాయామ విద్యా ఉపాధ్యాయులపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సంక్షేమ గురుకుల స్కూల్స్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి పీఈటీల కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో రాణించే విధంగా పీఈటీల కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల మానిసిక వికాసానికి దోహదపడే విధంగా పీఈటీలు అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
ప్రతి హైస్కూల్లో వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల ఉండాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అందులో 1600 పోస్టులు ఉన్న వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అన్నారు. గాల్‌రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నిరుద్యోల తరపున అధికార పార్టీలో ఉండి పోరాటం చేస్తున్న నాయకుడు చట్ట సభల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్సెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్ధించారు. ఈ సభకు రాష్ట్ర నిరుద్యోగ వ్యయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మాదగోని సైదులు, రాష్ట్ర జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ బి. లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎం. పర్వతాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు షాలువాలతో ఘనంగా సత్కరించారు.