మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
కేటీఆర్‌కు స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికుల వినతి
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూన్నా తమకు సరైన గుర్తింపు లేదని స్వచ్ఛ ఆటో, టిప్పర్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా ఒత్తిడి తేవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. శుక్రవారం యూనియన్ ప్రతినిధులు నందినగర్ నివాసంలో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నగర పరిశుభ్రత కోసం సుమారు 20 వేల మంది ఆటో, టిప్పర్ కార్మికులం 30 ఏళ్లుగా పని చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఏళ్లు గడిచినా జీవిత బీమా, ప్రమాదబీమా సౌకర్యం లేదని, జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో మహిళా కార్మికులకు కనీస వసతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల అద్దెల విషయంలో వివక్ష ఎదురవుతోందన్నారు. అధికారిక గుర్తింపు కల్పించడంతో పాటు కార్పొరేట్ స్థాయి గౌరవం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభు త్వం కొత్తగా తీసుకొచ్చిన ఇంటింటి చెత్త సేకరణ జీవో, బల్క్ గార్బేజ్ జీవోలను రద్దు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను విన్న కేటీఆర్, వారి న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.






