26-08-2025 02:38:42 AM
వివిధ శాఖ కార్యదర్శులకు బీసీ కమిషన్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది సమాచారాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ కమిషన్‌కు సమర్పించాలని సచివాలయ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులను బీసీ కమిషన్ ఆదేశించింది. సోమవారం సచివాలయ శాఖల కార్యదర్శులతో సమావేశమైంది. బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట బీసీ కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థ అని, బీసీల రిజర్వేషన్ అమలు విధానంపై పర్యవేక్షించడానికి ఏవైనా లోటుపాట్లపై ఫిర్యాదులు వస్తే విచారించి పరిష్కరిస్తోందని తెలిపారు. బీసీ కమిషన్ సేకరించిన వివరాల ఆధారంగా బీసీల సామాజిక, విద్య, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.