26 August, 2026 | 2:15 AM

గోదావరిఖని సినిమాను ఆదరించండి

26-08-2026 01:10 AM

సురేశ్, రాకేశ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న నూతన చిత్రం ‘కొత్త సినిమా’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు అజర్ స్టోరీ స్క్రీన్‌ప్లే డైరెక్షన్‌తోపాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీశ్ యాదవ్ నిర్మాతలు. త్వరలో ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్‌ను ‘వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్’ పేరుతో నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు పలువురు దర్శక నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అజర్ మాట్లాడుతూ.. “సినిమా ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం ఈ చిత్రంతో మొదలుపెట్టా. మా ఊరు గోదావరిఖనిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం” అని తెలిపారు.

నటుడు రాకేశ్ మాట్లాడుతూ.. “అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అందరి సపోర్ట్ కావాలి” అన్నారు. నటుడు సురేశ్ మాట్లాడుతూ.. “ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా పూర్తి చేశారు అజర్. పెద్ద వాళ్లు అండగా నిలబడితే మాలాంటి కొత్త వాళ్లం గుర్తింపు తెచ్చుకుంటాం” అని చెప్పారు. ఈ వేడుకలో అతిథులుగా విచ్చేసిన టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, దర్శకులు రమేశ్, వీరశంకర్, వీఎన్ ఆదిత్యతోపాటు ఈ చిత్ర డీవోపీ జానీ బాషా, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్, క్రిటిక్ చల్లా శ్రీనివాస్ కూడా మాట్లాడారు.