02-09-2025 11:33:56 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ యశోభూమిలో సెమీకాన్ ఇండియా సదస్సు-2025ను(Semicon India 2025) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) మంగళవారం నాడు ప్రారంభించారు. సదస్సులో కేంద్రమంత్రులు, అశ్వినీ వైష్ణవ్, జితన్ ప్రసాద, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల వినియోగం పెరిగిందని చెప్పారు. సదస్సుల్లో 40 దేశాల ప్రతినిధులు పాల్గొనడం సంతోషకరం అన్నారు. భారత్ ఆవిష్కరణలు, యువ శక్తి కూడా సదస్సులో ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచదేశాలకు భారత్ పై నమ్మకం పెరిగిందని తెలిపారు. పోటీ పెరిగిన తరుణంలోనూ భారత్ కు ఆదరణ తగ్గలేదని స్పష్టం చేశారు.
సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు భారత్ తో కలిసి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ యాత్రలో దేశానికి కీలక భాగస్వాములున్నారని తెలిపారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ(India's GDP) గణనీయ వృద్ధి నమోదు చేసిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నా.. భారత్ పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. ఆర్థిక మందగమనంలోనూ భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందని వివరించారు. అన్ని రంగాల్లోనూ భారత్ గణనీయ పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. భారత్ త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహిస్తోందని పేర్కొన్నారు. అంచనాల కంటే మెరుగ్గా పనిచేసి ఫలితాలు సాధిస్తున్నామని ప్రధాని(Prime Minister) వెల్లడించారు. సవాళ్లు ఎన్ని ఉన్నా వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్తున్నామని వివరించారు. సాంకేతికతలో మరిన్ని కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని సూచించారు. యువ పారిశ్రామికవేత్తలు(Young entrepreneurs) ముందుకొస్తేనే అభివృద్ధి సాధ్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.