02-09-2025 03:07:45 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్సీ కవితను(BRS MLC Kavitha ) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ కవిత సస్పెన్షన్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పందించారు. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆస్తులు, వాటాల్లో తగాదాలు ఉన్నాయని గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. ఆస్తులు, వాటాల్లో తగాదాలే సస్పెన్షన్ కు దారి తీసి ఉండొచ్చని తెలిపారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ అంతర్గతంగా జరిగిన వ్యవహారంపై స్పందించమని వెల్లడించారు. కవిత వెనుక ఉన్నామని కొందరు, హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నామని మరికొందరు అన్నారని ఆయన వివరించారు. మేము ప్రభుత్వం నడుపుతున్నాం.. ప్రజలు మా వెంట ఉన్నారు.. మేము ఎవరికో వత్తాసు పలకాల్సిన అవసరం పార్టీకి, సీఎంకు లేదని తెలిపారు. అవినీతిపరులందరినీ దూరం పెడతామని చెప్పారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబం కూడా అవినీతిలో కూరుకుపోయిందని మహేష్ గౌడ్ విమర్శించారు. అవినీతి ద్వారా వచ్చిన సంపదలో వాటాల విషయంలో తగాదా వచ్చినట్లుందన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్
కవిత పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, అందువల్లే కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత, తండ్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్నారు. కవిత తీరు బీఆర్ఎస్ కు నష్టం కలిగే రీతిలో ఉన్నాయని అధిష్ఠానం ఆరోపించింది. కవిత ఇటీవలి ప్రవర్తన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ గమనించిందని, వీటిని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని బీఆర్ఎస్ పార్టీ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపింది. "పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు శ్రీమతి కె. కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు" అని పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి. రవీందర్ రావు సంతకం చేసిన వార్తా ప్రకటనలో పేర్కొన్నారు. కవిత ఇటీవలే కాలంలో పార్టీ నాయకత్వంతో విభేదాలు ఎదుర్కొంటోంది. గత కొన్ని నెలలుగా తండ్రి కేసీఆర్, ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో ఆమెకున్న సంబంధాలు తెగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Lift Irrigation Project) జరిగిన అవినీతికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి లబ్ధి పొందారని కవిత ఆరోపించింది.