02-05-2025 08:30:44 PM
మందమర్రి,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జనగణన తోపాటు కులగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానికి నరేంద్ర మోడీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రోడ్డ మోహన్ మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో కులగణన చేపట్టగా సుమారుగ 78 సంవత్సరాల్లో ఇప్పటివరకు కులగణన జరగకపోవడం దౌర్భాగ్యకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
60 సంవత్సరాలు భారత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజున కులగణన చేపట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 1952లో అప్పటి ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత దళిత, గిరిజన, అల్పసంఖ్యాకుల గణన చేపట్టి దళితులను షెడ్యూల్డ్ క్యాస్ట్ గా గిరిజనులను షెడ్యూల్ తెగలుగా ప్రకటించి రాజ్యాంగంలో వారికి అనేక హక్కులను కల్పించినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలలో అత్యంత అల్పసంఖ్యాక వర్గాలు ప్రభుత్వ ఫలాలకు నోచుకోకుండా జీవిస్తున్నారని కులగణన ధ్వారానే వారికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశ స్వాతంత్రం అనంతరం తీసుకున్న అనేక సాసోపేతమైన నిర్ణయాలన్ని కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలిగిందని సాహసోపేతమైన నిర్ణయాలన్నీ బీజేపీ తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు సిఏఏ ఆర్టికల్ 370, ఎస్సీ వర్గీకరణ, సింగరేణి కార్మికుల భవిష్యత్తు నిధి 140 కోట్లకు పెంచడం, భారత్ మాల కార్యక్రమం కింద అత్యంత దూరభారమైనటు వంటి పల్లెలను పట్టణాలకు కలుపుతూ రోడ్ల నిర్మాణం, తదితర కార్యక్రమాలన్నీ కూడా బిజెపి ప్రభుత్వం లోనే నెరవేరతాయని ఆయన గుర్తు చేశారు. కరోనా కష్ట సమయంలో ప్రపంచానికి దిక్సూచిగా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందన్నారు.తెలంగాణలో చేపట్టిన కుల గణన కార్యక్రమాన్ని చూసి నరేంద్ర మోడీ దేశంలో కులగణనకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ ప్రచారం చేయడం హాస్యస్పదమని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డివి దీక్షితులు, రాంటెంకి దుర్గరాజు, విహెచ్పిఎస్ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, పట్టణ నాయకులు కోలేటి శివ, సంతోష్, ప్రసాద్ లు పాల్గొన్నారు.