calender_icon.png 3 May, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికం మాటేమిటి?

03-05-2025 01:25:43 AM

  1. కులగణనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ 
  2. ఆసక్తికరంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
  3. బీసీ రిజర్వేషన్ల అమలుపై అనుమానాలు 
  4. కాంగ్రెస్ సర్వే తప్పులతడక అంటున్న బీజేపీ

హైదరాబాద్, మే 2 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలకంగా చర్చ జరుగుతూనే వస్తోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీలంతా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పట్టుబట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయించుకునే దిశగా కార్యాచరణ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయపరమైన 42 శాతం రిజర్వేషన్ హక్కును వారికిచ్చేందుకు ముందుకొచ్చింది. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన కూడా చేయాలనే బీసీల డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రప్రభుత్వం నిర్ణయం  నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

42 శాతం అమలయ్యేనా?..

జనగణనలో కులగణన చేపట్టాలని కేం ద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 2026లో జనగణన చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను ఆమోదించే అవకాశం లేదని అభిప్రా యపడుతున్నారు.

అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన నివేదికకు ఆమోదం లభించడం ఎంతో ముఖ్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి, పార్లమెం ట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. 

లేనిపక్షంలో కేవలం తెలంగాణలో మాత్రమే ఇప్పటికిప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకావాలంటే 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల సీలింగ్‌ను పార్లమెంట్‌లో చట్టసవరణ చేసి సవరించాలి. అయితే వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం పార్లమెంట్ చట్టసవరణ చేసే అవకాశం ఉంటుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీలంతా 42 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ సమస్య పరిష్కారమై ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరగాలని బీసీలంతా ఆకాంక్షిస్తున్నారు. 

పాలక, ప్రతిపక్షాల తీరు వేరు..

వాస్తవానికి దేశంలో 1931తర్వాత దేశవ్యాప్త జనగణన జరగలేదు. మొట్టమొదటి సారి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించారు. ఈ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. తెలంగాణలో కులగణన చేపట్టడం తోపాటు దేశ వ్యాప్తంగా కూడా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సానుకూల పరిణామమే.

కులగణన అంశం లో తెలంగాణ ఆచరించిన విధానాన్నే కేం ద్రం అనుసరిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థించుకుంటున్న క్రమంలో జన గణనలో కులగణన చేపట్టేందుకు ఒప్పుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడక అని బీజేపీ విమర్శిస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన కులగణన శాస్త్రీయంగా నిర్వహించలేదని ఆరోపిస్తున్నది. బీసీలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెబుతున్నది.

వాస్తవానికి తెలంగాణలో కులగణన చేపట్టి కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించింది. అయితే ప్రస్తుత కేంద్రప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా జనగణన చేపట్టిన తర్వాతనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పేందుకు బీజేపీకి ఒక  అవకాశం లభించిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తప్పుడు సర్వే నివేదికను కారణంగా చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం అంశంపై కాంగ్రెస్, బీజేపీల తీరుకు భిన్నం గా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్నది. కేంద్ర, రాష్ట్రాల్లో పాలకపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ రిజర్వేషన్ల అంశంపై వారి నిర్ణయాలను సమర్థించుకుంటుంటే బీఆర్‌ఎస్ మాత్రం మధ్యే మార్గంగా నోరు మెదపడం లేదు. వాస్తవానికి బీసీల తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఎక్కువగా ఉంది.

కానీ ఆ బాధ్యత నుంచి బీఆర్‌ఎస్ పక్కకుతప్పుకున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. పాలక, ప్రతి పక్షపార్టీల తీరుతో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. తద్వారా బీసీల రిజర్వేషన్ల సాధనతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలూ ఆలస్యమవుతున్నాయి.