calender_icon.png 3 May, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొయినుద్దీన్ అరెస్ట్!

03-05-2025 01:42:16 AM

గొర్రెల స్కాం

గొర్రెల పంపిణీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు

  1. కోకాపేటలో అతడి భార్య ఇంట్లో తెల్లవారుజాము వరకు తనిఖీ
  2. ఆమె ఖాతాలోకి భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్
  3. ఇప్పటికే 17మంది నిందితుల అరెస్ట్
  4. కుంభకోణం విలువ రూ.700 కోట్లు

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి)/ రాజేంద్రనగర్ : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో కీలక పరిణామం జరి గింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మొయినుద్దీన్‌ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన ట్టు తెలిసింది.

బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించగా.. ఇప్పటివరకు 17మందిని అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడు మొయినుద్దీన్ అరెస్టుతో ఈ సంఖ్య 18కి చేరుకుం ది.

మొయినుద్దీన్ ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తిం చి అరెస్టు చేసేలోపే మొయినుద్దీన్ తన కుమారుడితో కలిసి దుబాయ్ పారిపోగా.. పోలీసులు లుక్‌అవుట్ నోటీసు జారీచేశారు. నిందితున్ని విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు చెబుతున్నారు.

ఈ స్కామ్‌లో ఇప్పటికే అరెస్టున స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన జీ కల్యాణ్‌కుమార్ కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో గొర్రెలను కొనాలని రాష్ర్టవ్యాప్తంగా పశుసం వర్ధక శాఖ సంయుక్త సంచాలకులకు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారిని అరెస్ట్‌చేసి.. న్యాయస్థానంలో హాజరుపరచగా..ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

2 కార్లు సీజ్ చేసిన ఏసీబీ..

మొయినుద్దీన్ భార్య నివాసముండే కోకాపేటలోని మూవీటవర్‌లోని ఇంట్లో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలకు వెళ్లగా ఆమె అడ్డుకుంది. అయితే సెర్చ్ వారెంట్ చూపించి అధికారులు తెల్లవారుజామున 2.30 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 2 కార్లను సీజ్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా అధికారులు కొ న్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ లో భారీగా డబ్బులు వెన కేసుకున్న మొయినుద్దీన్ తన భార్య ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అక్రమాలకు ఉదాహరణలివే..

గొర్రెల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలపై కాగ్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలో ఒక హీరోహోండా స్లెండర్ బండిపై 126 గొర్రెలు ప్రయాణం చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 168 గొర్రెలు టాటా ఇండికా కారులో వెళ్లాయి. ఖమ్మంలో 84 గొర్రెలు మారుతీ ఓమ్నీ అది కూడా అంబులెన్సులో సర్దుకుని వెళ్లాయి. ఇక నల్లగొండ జిల్లాలోని 126 గొర్రెలు ఒక ఆటోలో ప్రయాణం చేశాయి.

గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఈ గొర్రెలన్నీ అలా ఇరుకుగా సర్దుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినట్టు స్వయంగా ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లోనే స్పష్టంగా ఉంది. గొర్రెల పంపిణీ పథకం అక్రమాల్లో ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. తెలంగాణలో ఈ పథకం అమలుపై మొత్తం 7 జిల్లాల్లో లెక్కలు చూసిన కాగ్ దృష్టికి వచ్చిన విషయాలు ఇవి.. ఈ నాలుగే కాదు మొత్తం ఇలా 336 బిల్లుల్లో 53 రెండు చక్రాల బైకులు, 219 ప్యాసింజర్ ఆటోలు, 35 కార్లు, 27 బస్సుల్లో గొర్రెలను తీసుకెళ్లినట్లు రాశారు.

మరో ఇద్దరు రెండు అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్టు రాశారు. వీరంతా ఫర్వాలేదు. ఏదో ఒక బండి పేరు ఇరికించారు. ఇక మరో 262 బిల్లుల్లో అయితే వాళ్లు రాసిన బండి నంబర్ పేరుతో అసలు ఏ బండీ లేదు. రవాణాశాఖ దగ్గర లేని రిజిస్ట్రేషన్ నంబర్లను రాసి డబ్బు తీసుకున్నారు. ఇదంతా కేవలం 7 జిల్లాల లెక్క మాత్రమే. మిగిలిన 26 జిల్లాల్లో కాగ్ లెక్కలు చూడలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌క ర్నూలు, నల్లగొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో లెక్కలు తీస్తేనే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా రూ.2,543 కోట్ల దుర్వినియోగం అయినట్టు కాగ్ అంచనా వేసింది.

రూ.700కోట్ల కుంభకోణం 

గొర్రెల పెంపకంపై ఆధారపడిన గొల్ల, కురుమ కుటుంబాలకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసి కులవృత్తులకు అండగా ఉండటంతో పాటు రాష్ర్టంలో మాంసపు కొరత లేకుండా చేసేందుకుగాను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకంలో భాగంగా అర్హుడైన లబ్ధ్దిదారుడికి 20 గొర్రె లు, ఒక పొట్టేలు ఇస్తారు. ఈ యూనిట్ విలువ రూ.1.58లక్షలు.

అందులో గొర్రెల పెంపకందారు రూ.43,750 చెల్లించాలి. మిగతాది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 2017 ఏప్రిల్‌లో ఈ పథకం ప్రారంభమైంది. అయితే ఈ పథకంలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. రూ.2.10 కోట్ల మేర అక్రమాలు జరిగాయ న్న ఆరోపణలతో ఈ కేసు దర్యాప్తు ప్రారం భం కాగా.. మొత్తం రూ.700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

నకిలీ బిల్లులు, ఓచర్లతో ప్రైవే టు వ్యక్తుల ఖాతాలో జమ చేసిన సొమ్ము ఎవరెవరు ఎంత పంచుకున్నారు? అక్రమాల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధి కా రుల పాత్రపై విచారణ జరుగుతోంది. స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మాజీ సీఈవో రాంచందర్‌తోపాటు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన జీ కల్యాణ్ కుమార్ ఈ కేసులో అరెస్టయ్యారు. తాజాగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ విదేశా ల నుంచి వస్తుంటే ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.