ఖమ్మం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం, ఆగస్టు 12 (విజయక్రాంతి): నేరాల పరిశోధన, నిందితుల గుర్తింపును వేగవంతం చేయడానికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా చేరుకున్న పోలీస్ కమిషనర్ బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు,. సీసీటీఎన్‌ఎస్ అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ లో వస్తున్న అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవాలాని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, సాంకేతికతను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
జిల్లాలో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టేందుకు ఈ ప్రాజెక్టులో నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నారని , వాటిపై పరిణితి సాధించాలని సూచించారు. ఉన్నతాధికారులు ప్రాజెక్టును సమర్థవంతంగా ఉపయోగించాలని..... తద్వారా క్రింది స్థాయి సిబ్బంది మరింత మెరుగ్గా వినియోగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా ఈ-సమన్స్, ఈ-సాక్ష్యా వంటి వాటిని విస్తృతంగా ఉపయోగించాలని వివరించారు. రౌడీ షీటర్ల ను కౌన్సిలింగ్ చేయాలని, అదేవిదంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి పాల్గొన్నారు.






