03-05-2025 07:27:30 PM
హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల శుక్రవారం రాత్రి ఓ ప్రత్యేకమైన ప్రదర్శనకు వేదికైంది. కోహెడ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కనువిప్పు' కార్యక్రమం ప్రజల ఆలోచనలను తట్టిలేపింది. ముఖ్యంగా యువత తప్పుదోవ పట్టకుండా సరైన మార్గంలో నడవాలని ఎస్సై అభిలాష్ పిలుపునిచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం ఎలా నాశనమవుతుందో కండ్లకు కట్టినట్టు వివరించారు. "సరదా అనుకుంటే మీ జీవితం దుర్భరమవుతుంది" అని ఆయన హెచ్చరించడం యువతను ఆలోచింపజేసింది.
కేవలం యువతకే కాదు, తల్లిదండ్రులకు కూడా ఆయన ముఖ్యమైన సూచనలు చేశారు. తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. పోలీసులు వారిని పిలిపించి సరైన కౌన్సిలింగ్ ఇస్తారని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాల గురించి వివరిస్తూ, ఎస్సై ప్రజలను అప్రమత్తం చేశారు. బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.
ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలపై కూడా పోలీసులు ప్రజలను అలెర్టు చేశారు. మంత్రాలు, తంత్రాలు నమ్మి దాడులు చేసుకోవడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామంలో భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాల ఆవశ్యకతను ఎస్సై నొక్కి చెప్పారు. గ్రామస్తులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దని సూచించారు.
"ఈ క్షణికమైన సరదాలు మీ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి" అని హెచ్చరించారు. సిద్దిపేట పోలీసు కళాబృందం తమ ప్రదర్శనతో ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు శంకర్ బాబు, సౌమ్య, భాస్కర్, అరుణ తమ పాటలు, నాటకాల ద్వారా మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించారు. వారి కళా ప్రదర్శన ప్రజల హృదయాలను తాకింది. యువత సరైన మార్గంలో నడవాలని, సమాజం క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పోలీసులు చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం.