27-10-2025 08:20:14 PM
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీ
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో బోడుప్పల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ కమాన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు విభాగం యొక్క త్యాగస్ఫూర్తి, సేవా భావం, సామాజిక బాధ్యతలను ప్రజలకు తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి డివిజన్ ఏసిపి ఎస్.చక్రపాణి మాట్లాడుతూ “పోలీసులు ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. పోలీసు అమర వీరుల త్యాగం స్మరణీయమైనది. ఈ సైకిల్ ర్యాలీ ద్వారా ఆ త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజలలో, యువతలో సేవా స్పూర్తిని పెంపొందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్, గోవింద రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది, దాదాపు 200 మంది వివిధ పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.