16-12-2025 06:32:16 PM
టేకులపల్లి (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసుల కవాతు నిర్వహిస్తున్నామని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. పంచాయతీ ఎన్నికల మూడో విడత సందర్భంగా మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలో ఇల్లందు డీఎస్పీతో పాటు టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ అరకుల రాజేందర్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలతో మండల కేంద్రంలోని దాసుతండ నుంచి గోల్యాతండా వరకు కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకొనేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా.. శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల తమ ఓటుహక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.